‘గొప్ప స్టార్‌గా ఎదగాలనే లక్ష్యంతోనే సినిమాల్లోకి వచ్చాను. హీరో..విలన్ పాత్ర ఏది చేసినా కెరీర్లో ఉన్నతికే దోహదపడుతుందని భావిస్తున్నా. జయాపజయాల లెక్కల్ని పట్టించుకోకుండా మంచి కంటెంట్ మీదనే దృష్టిపెడుతున్నా’ అని అన్నారు కార్తికేయ. ఆయన ప్రతినాయకుడి పాత్రను పోషించిన తమిళ చిత్రం ‘వలీమై’ అదే పేరుతో తెలుగులో అనువాదమైంది. అజిత్ కథానాయకుడు. వినోద్ దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం కార్తికేయ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
ఇదివరకు ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ‘వలీమై’లో విలనీకి ఎలాంటి ప్రత్యేకత ఉంటుంది?
మూడేళ్ల క్రితమే దర్శకుడు వినోద్ ఈ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది. ‘గ్యాంగ్‌లీడర్’ కంటే శక్తివంతమైన విలనీ పండించడానికి ఆస్కారమున్న పాత్ర ఇది. నా క్యారెక్టర్ డిజైన్లోనే విభిన్న కోణాలు కనిపిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. అజిత్ వంటి అగ్రహీరో పక్కన ప్రతినాయకుడిగా నటిస్తున్నామంటే నా పాత్రకు ఆడియెన్స్ రీచ్ ఎక్కువవుతుంది. దాంతో సింగిల్‌సిట్టింగ్‌లోనే ఈ సినిమా అంగీకరించా.
ఈ సినిమాలో మీరు బైక్రేసర్గా నటిస్తున్నారు.. అందుకోసం ఏమైనా శిక్షణ తీసుకున్నారా?
షూటింగ్‌కు కొన్ని రోజుల ముందు బైక్ రేసింగ్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నా. అజిత్గారు ప్రొఫెషనల్ బైక్ రేసర్ అన్న విషయం అందరికి తెలిసిందే. షూటింగ్లో ఆయనతో సమానంగా బైక్ నడపడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. లొకేషన్లో నేను పడే ఇబ్బందుల్ని చూసి ఆయనే స్పీడ్ తగ్గించుకొని నాతో సమానంగా బైక్ నడిపేవారు (నవ్వుతూ).
అసలు ‘వలీమై’ అంటే అర్థం ఏమిటి? తెలుగులో కూడా అదే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
తమిళంలో ‘వలీమై’ అంటే మానసికంగా దృఢమైన సంకల్పాన్ని, బలాన్ని కలిగిఉండటం. తొలుత తెలుగులో ఆ టైటిల్ సమానార్థం వచ్చేలా పేరు పెడదామనుకు న్నాం. అయితే గత రెండేళ్లకాలంలో వలీ మై అనే పేరు తెలుగు ప్రేక్షకుల్లో బాగా రిజిష్టర్ అయింది. దాంతో టైటిల్ అర్థం తెలియకపోయినా తెలుగులో కూడా ఆ పదమే బాగుంటుందనుకున్నాం. టైటిల్ విషయంలో దర్శకనిర్మాతలే నిర్ణయం తీసుకున్నారు.
హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ రెండింటిలో మీకు ఏది సౌకర్యవంతంగా అనిపిస్తున్నది?
వాస్తవం చెప్పాలంటే విలన్ పాత్రల్నే ఎ క్కువగా ఎంజాయ్ చేయొచ్చు. హీరోకు కథాపరంగా కొన్ని పరిధులుంటాయి. ప్రతినాయకుడికి అలాంటివేమీ ఉండవు. క్యారెక్టర్‌కు అనుగుణంగా ఏ స్థాయి నటననైనా ప్రదర్శించవొచ్చు. ముఖ్యంగా హీరో కు ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. సినిమా తాలూకు జయాపజయాల బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అదే విలన్‌గా చేస్తే అలాంటి లెక్కల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు (నవ్వుతూ). కేవలం పర్ఫార్మెన్స్పైన దృష్టి పెడితే సరిపోతుంది.
‘వలీమై’లో యాక్షన్ పరంగా ఉన్న ప్రత్యేకతలేమిటి?
సిద్ధాంత వైరుధ్యాల వల్ల్ల చోటుచేసుకునే సంఘర్షణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. భాషా బేధాలకు అతీతంగా కథలో యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ పతాకస్థాయి హంగులతో రొమాంచితంగా సాగుతాయి. ఇటీవలకాలంలో ఈ స్థాయి పోరాటఘట్టాల్ని ఏ సినిమాలో చూసి ఉండరని నమ్మకంగా చెబుతున్నా.
ఈ సినిమా మీ కెరీర్‌కు ఎలాంటి తోడ్పాటునందిస్తుందని అనుకుంటున్నారు?
అజిత్ వంటి అగ్రనటుడితో పాన్ ఇండియా సినిమాలో భాగం కావడమే గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సినిమా ద్వారా ఇతర భాషల్లో కూడా నాకు గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తులో ఇతర భాషా చిత్రాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి ఈ సినిమా మంచి వేదికగా నిలుస్తుందనుకుంటున్నా.