Gun culture | వెండితెరపై కత్తి యుద్ధాలు చూసి మురిసిపోయాం. వింత శబ్దాలతో సాగే శర పరంపరనూ ఆస్వాదించాం. తర్వాతి రోజుల్లో.. హీరోగారు లెక్కపెట్టుకోకుండా రివాల్వర్‌తో ఎన్నిసార్లు కాలుస్తున్నా సంబురపడ్డాం. హీరో స్ఫూర్తితో చేతివేళ్లను తుపాకీలా పెట్టి ‘డిష్యుం డిష్యుం’ అంటూ బాల్యాన్ని ఎంజాయ్ చేశాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. మోయలేనంత భారీ గన్లతో హీరోలు విరుచుకుపడుతున్నారు. హెవీ మెషిన్గన్లతో సీన్ పండించేస్తున్నారు. బాక్సాఫీస్‌ను టార్గెట్ చేసి ట్రిగ్గర్ నొక్కుతున్నారు. కార్తి ఖైదీ నుంచి ఊపందుకున్న ఈ గన్ గలాటా.. పతాక సన్నివేశాన్ని ఆకాశమెత్తుకు తీసుకెళ్లి ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ పంచుతున్నది.
గన్ కల్చర్ సినిమాల్లో ఎప్పట్నుంచో ఉన్నదే! నలుపు తెలుపు చిత్రాల్లోనూ మెరుపులు విరజిమ్ముతూ తుపాకీలు పేలేవి. కొన్ని సినిమాల్లో బొమ్మ తుపాకీల్లా కనిపించినా.. ఆ రోజుల్లో అదే గొప్పగా భావించేవాళ్లు. కమర్షియల్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో అయితే ప్రతి మూడు సీన్లకు ఆరు తూటాలు పేలేవి. రివాల్వర్లు, నాటు తుపాకులు, రైఫిళ్లు, తపంచాలు.. ఒకటేమిటి రకరకాల ఆయుధాలు సినిమాల వల్లే ప్రేక్షకులకు పరిచయమయ్యాయి. 90వ దశకంలో సినిమాల్లో మెషిన్గన్ల రాక మొదలైంది. ఎక్కడినుంచి వచ్చేవో తెలియదు.. క్లయిమాక్స్ సీన్లో పదుల సంఖ్యలో ఏకే 47లు ప్రత్యక్షమయ్యేవి.
అవన్నీ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా.. హీరోకు ఒక్కటీ తగలకపోయేవి. హీరో చేతికి ఒక్క రివాల్వర్ దొరికితే చాలు.. పాతికమంది విలన్లు టపాటపా రాలిపోయేవారు. హీరోలు గన్ పట్టుకున్న ఫొటోలు ప్రచార చిత్రాల్లో విస్తృతంగా వాడేవాళ్లు కూడా! ఈ గతమంతా కాసేపు పక్కనపెడితే.. ఇప్పుడు మరో లెక్క నడుసున్నది! ఒకప్పుడు విలన్లు ఎక్కువగా ఉపయోగించే తుపాకులను ఇప్పుడు హీరో మక్కువగా వినియోగిస్తున్నారు. పాత్రోచితంగా గన్ పట్టుకోవడం సబబే! కానీ, చూసీ చూడగానే విలన్లు బెంబేల్తెతిపోయే భారీ గన్లను పట్టుకుంటున్నారు. దీపావళికి థౌజెండ్ వాలా పేల్చినట్టు.. నాలుగైదు నిమిషాలు ఆ భారీ తుపాకీతో విధ్వంసం సృష్టిస్తున్నారు హీరోలు!!
రాఖీభాయ్ విధ్వంసం
భారతీయ చలన చిత్ర చరిత్రలో ‘కేజీఎఫ్’ ఒక సంచలనం. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాను ఆసేతు హిమాచలం విపరీతంగా ఆదరించింది. మొదటి భాగాన్ని మించిన అంచనాల మధ్య విడుదలైన రెండో భాగానికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమా అంతా ఒకెత్తు. రాఖీ భాయ్ సృష్టించే విధ్వంసం మరో ఎత్తు. భారీ మెషిన్ గన్ వేసుకొని వచ్చి ప్రభుత్వ కార్యాలయంపై బుల్లెట్ల వర్షం కురిపించిన సీన్ చూసి ఆశ్చర్యపోవడం చూసినవారి వంతైంది. సినిమానే అయినా, అది డమ్మీ గన్ అని తెలిసినా.. ట్రిగ్గర్ నొక్కి ఇంటెన్సిటీతో కాలుస్తుంటే వాహనాలు సైతం గాల్లోకి తేలిపోతుంటాయి. ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూస్తుంటారు.
కేజీఎఫ్‌లో హీరో వాడిన గన్ గురించి తర్వాత గూగుల్‌లో లక్షలాది మంది సెర్చ్ చేశారంటే.. ఆ సీన్‌కు జనం ఎంత కనెక్ట్ అయ్యారో తెలుస్తుంది. సోవియట్ హెవీ మెషిన్ గన్ మాడల్ ‘దుష్కా’ ఇదే తరహాలో ఉంటుంది. 1938లో తయారైన ఈ మెషిన్ గన్ రెండో ప్రపంచ యుద్ధంలో ప్రత్యర్థులను చీల్చి చెండాడింది. తర్వాత మరెన్నో యుద్ధాల్లోనూ దుష్కా దుష్టసంహారం గావించింది. కేజీఎఫ్ రావడంతో దీని పుట్టుపూర్వోత్తరాల గురించి మనకూ తెలిసొచ్చింది.
కొత్తగా ఒక టెండ్ వస్తే దానిని కొంతకాలం కొనసాగించడం ఇండస్ట్రీలో మామూలే! చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లోనూ హెవీగన్ సీన్లు ప్రేక్షకులను అలరించాయి. నాగార్జున చిత్రం ‘ద ఘోస్ట్’లో కూడా హెవీగన్ కనిపిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘ఎఫ్3’లో కమెడియన్ అలీతో హెవీగన్ విన్యాసాన్ని చేయించి నవ్వులు పూయించారు. మొత్తంగా ఈ మధ్యే ఇండస్ట్రీకి పరిచయమైన హెవీగన్ ఇంకొంతకాలం వెండితెరపై తూటాలు పేల్చడం ఖాయమని చెప్పక తప్పదు.
ఖైదీతో మొదలు
కార్తి నటించిన ఖైదీ చిత్రం 2018లో సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో పోలీసులను కాపాడే క్రమంలో లారీ నడుపుతాడు హీరో. దారిలో తమ వాహనాన్ని అడ్డగించిన విలన్ల బృందాన్ని చెడుగుడు ఆడుకుంటాడు. మరోవైపు కూతురు సెంటిమెంట్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే, క్లయిమాక్స్‌కు వచ్చేసరికి ఎస్పీ ఆఫీస్‌లో దాచి ఉంచిన ఓ భారీగన్ హీరో కంటపడుతుంది. అర్జునుడికి పాశుపతం దొరికినట్టుగా, ఒక్కసారిగా విశ్వరూపం చూపిస్తాడు హీరో! టెర్మినేటర్ సిరీస్‌లో ఉపయోగించేలాంటి పెద్ద రైఫిల్‌ను భుజానికి తగిలించుకొని మూడు నిమిషాలపాటు ట్రిగ్గర్ నొక్కి పట్టుకుంటాడు. గన్‌లో నుంచి దూసుకొచ్చే వందలాది బుల్లెట్లు శత్రుమూకలకు తూట్లు పొడుస్తాయి. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. థియేటర్లో చప్పట్లు దద్దరిల్లాయి. ఈలల మోత మోగింది. ఖైదీ విజయంలో ఈ గన్ సీన్ కూడా బాగానే పేలింది.
విక్రమ్ విలయం
చాలా రోజుల తర్వాత ‘విక్రమ్’ రూపంలో కమల్‌ను మంచి హిట్ పలకరించింది. డ్రగ్ మాఫియాను అంతమొందించే థీమ్‌తో నిర్మించిన ఈ సినిమాలో మొదటి సీన్ నుంచీ తూటాలు పేలుతూనే ఉంటాయి. అవన్నీ ఎలా ఉన్నా.. క్లయిమాక్స్‌లో కమల్ భారీ గన్‌తో విలయతాండవం చేసిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పాతకాలం నాటి హెవీ గన్ను అలా లాక్కొచ్చి, బుల్లెట్లు లోడ్ చేసి పేలుస్తుంటే… సీన్లోని వాహనాలు మాత్రమే కాదు, థియేటర్లోని ప్రేక్షకులూ ఎగిరెగిరి పేపర్లు ఎగిరేశారు. బీభత్సం సృష్టించారు.