Akshay Kumar Market | బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన సినిమాలు తెలుగులో ఎక్కువగా రిలీజ్ కాకపోయినా.. హిందీ సినిమాలతోనే టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. రోటీన్‌కు భిన్నంగా సినిమాలను చేస్తూ బాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అక్షయ్, ఏ హీరోకు సాధ్యం కాని విధంగా ఏడాదికి నాలుగైదు సినిమాలను రిలీజ్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది ఈయన నటించిన ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అందులో ఏ ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయాయి.
ఈ ఏడాది అక్షయ్‌కుమార్‌కు అంతగా కలిసి రాలేదు. భారీ అంచనాల నడుమ రిలీజైన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈ ఏడాది మొదటగా రిలీజైన ‘బచ్చన్‌పాండే’ బడ్జెట్లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది. ఆ తర్వాత మూడు నెలల గ్యాప్‌లో భారీ అంచనాల నడుమ రిలీజైన ‘సామ్రాట్ పృథ్విరాజ్’.. అక్షయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలింది. ఈ చిత్రానికి రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ వచ్చినా, కలెక్షన్లలో మాత్రం జోరు చూపించలేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘రక్షాబంధన్’ కూడా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ఓపెనింగ్స్ భారీ గానే వచ్చినా.. రెండో రోజు నుండి ఫుల్ డ్రాప్స్ పడ్డాయి.
ఈ క్రమంలో అక్షయ్ ఓటీటీని నమ్ముకుని ‘కట్పట్లీ’ సినిమాను నేరుగా హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశాడు. అయితే ఈ చిత్రం ఓటీటీలో లోయెస్ట్ వ్యూవర్షిప్ సాధించి అక్షయ్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. చివరికి ‘రామ్‌సేతు’ వంటి అడ్వేంచర్ కాన్సెప్ట్‌ను నమ్ముకున్న అక్షయ్‌కు నిరాశే మిగిలింది. దీపావళి కానుకగా రిలీజైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న బ్రేక్ ఈవెన్ కోసం బాక్సాఫీస్ దగ్గర కష్టపడుతుంది. ఈ ఏడాది అక్షయ్‌కు ఏ మాత్రం కలిసి రాలేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోయిన అక్షయ్.. ఇప్పుడు అదే బాక్సాఫీస్ దగ్గర ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఈయన మార్కెట్ హిందీలో భారీగా తగ్గిందని టాక్. అయితే ఫలితం ఎలా ఉన్నా అక్షయ్ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు.