Harudu Movie | ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’, ‘ఆనందం’, ‘శివరామరాజు’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు వెంకట్. ఇటీవల పవన్ కళ్యాణ్ ‘ఓజి’ (OG) చిత్రంలో కీలక పాత్రలో మెప్పించిన ఆయన, ఇప్పుడు ‘హరుడు’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజ్ తల్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామా మే 15న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
ముంబై మాఫియాను గడగడలాడించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ డిసిపి శంకర్ అలియాస్ ఎన్కౌంటర్ శంకర్ (వెంకట్) హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ ఫర్ అవుతాడు. నగరంలో అడుగుపెట్టడమే తనదైన స్టైల్లో క్రిమినల్స్ ఆట కట్టిస్తూ శాంతిభద్రతలను అదుపులోకి తెస్తాడు. అదే సమయంలో నగరంలో పైకి మంచివాడిలా నటిస్తూ లోపల అక్రమ దందాలు సాగించే లోకల్ ఎమ్మెల్యే వరదరాజులు (శ్రీహరి పైలా) సామ్రాజ్యం నడుస్తుంటుంది. ఒక గంజాయి కేసులో ఇరుక్కున్న అమాయక ఆటో డ్రైవర్‌ను విడిపించే క్రమంలో శంకర్, వరదరాజులు మొదటిసారి ఎదురుపడతారు. మరోవైపు, నిరుద్యోగులైన కొందరు విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవడం కోసం, ఒక ‘ఫుడ్ కోర్ట్’ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కార్ల ఇంజిన్లను దొంగతనం చేస్తుంటారు. ఒకరోజు వారు పోలీసులకు చిక్కగా, వారిని విడిపించేందుకు వరదరాజులు పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. అయితే, స్టేషన్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ విద్యార్థులపై ఘోరమైన దాడి జరుగుతుంది. ఈ దాడి చేయించింది మరెవరో కాదు, సాక్షాత్తూ వరదరాజులే అని తెలిసి శంకర్ షాక్ అవుతాడు. అసలు మంచివాడిలా చలామణీ అవుతున్న వరదరాజుల వెనుక ఉన్న క్రూరమైన రాజకీయం ఏంటి? ఆ స్టూడెంట్స్ దొంగతనం చేసిన ఇంజిన్లకి, వరదరాజుల పొలిటికల్ కెరీర్‌కి ఉన్న లింక్ ఏంటి? శంకర్ భార్య ప్రియ (నటాషా సింగ్) హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? వీటన్నింటికీ శంకర్ ఎలా ముగింపు పలికాడు? అనేదే మిగతా సినిమా.
విశ్లేషణ & సాంకేతిక విభాగం
దర్శకుడు రాజ్ తల్లూరి ఎంచుకున్న కథ, కథనం మరియు మేకింగ్ కాస్త పాత కాలపు కమర్షియల్ ఫార్మాట్‌లా అనిపించినప్పటికీ, ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడంలో ఆయన కొంతవరకు విజయం సాధించారు. స్క్రీన్‌ప్లే కాస్త ఊహాజనితంగా సాగడం, తదుపరి సీన్ ఏంటి అనేది ప్రేక్షకుడు సులభంగా గెస్ చేసేలా ఉండటం సినిమాకు కొంత మైనస్ పాయింట్. అయినప్పటికీ, కమర్షియల్ లెక్కలు తప్పకుండా పాటలు, ఫైట్లు, కామెడీ, ఎమోషన్స్ అన్నింటినీ సరైన నిష్పత్తిలో జోడించారు. సినిమా మొదటి సీన్ నుంచే ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తుంది. హీరో పవర్ ఫుల్ ఇంట్రడక్షన్, నగరంలో క్రైమ్ సీన్లు, స్టూడెంట్స్ ఇంజిన్ల దొంగతనం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ వేగంగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ బాగున్నాయి. క్లైమాక్స్ ఊహించినట్లే ఉన్నప్పటికీ యాక్షన్ ప్రియులను మెప్పిస్తుంది. సినిమా రన్ టైమ్ తక్కువగా ఉండటం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది.
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఆనంద్ మరుకుర్తి విజువల్స్ బాగున్నాయి. మణిజెన్నా అందించిన సంగీతం, నేపథ్యం స్కోర్ యాక్షన్ సీన్లను బాగానే ఎలివేట్ చేశాయి. ఉప్పు మారుతీ ఎడిటింగ్ నీట్‌గా ఉంది. వీ ఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు డిక్కల లక్ష్మణరావ్, ప్రవీణ్ రెడ్డి వి పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.
నటీనటుల ప్రతిభ
ఎన్కౌంటర్ శంకర్‌గా వెంకట్ అద్భుతంగా సెట్ అయ్యారు. ఇప్పటికీ అదే ఫిట్నెస్తో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్‌లో మెప్పించారు. ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వెంకట్ భార్యగా నటించిన నటాషా సింగ్ స్క్రీన్ టైమ్ తక్కువే అయినా, తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. హెబ్బా పటేల్, వేద్విక సోనీ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. విలన్‌గా శ్రీహరి పైలా క్రూరత్వాన్ని బాగా పండించారు. చాలా కాలం తర్వాత అలీ తన మార్క్ కామెడీతో నవ్వించగా, ప్రత్యేక గీతంలో సలోని తన గ్లామర్‌తో మెరిసింది. మిగిలిన పాత్రల్లో సుమన్, షానీ, రవిందర్ తదితరులు తమ నటనతో సపోర్ట్ చేశారు.
ప్లస్ పాయింట్స్:
పోలీస్ ఆఫీసర్‌గా వెంకట్ ఫిట్నెస్ మరియు పవర్ ఫుల్ నటన
ఇంటర్వెల్ ట్విస్ట్ & ఫ్లాష్ బ్యాక్ ఎమోషన్స్
తక్కువ రన్ టైమ్
ఆకట్టుకునే కమర్షియల్ అంశాలు (ఫైట్స్, కామెడీ)
మైనస్ పాయింట్స్:
పాత ఫార్మాట్ కథ, కథనం
ఊహాజనితంగా సాగే సన్నివేశాలు
ముగింపు:
మొత్తంగా చూసుకుంటే, ‘హరుడు’ పాత కథే అయినప్పటికీ బోర్ కొట్టించని కమర్షియల్ పోలీస్ డ్రామా. పక్కా యాక్షన్ అంశాలు, పోలీస్ బ్యాక్‌డ్రాప్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను, వెంకట్ అభిమానులను ఈ చిత్రం నిరాశపరచదు.
రేటింగ్: 2.75 / 5