HanuMan Universe Next Chapter | టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘హనుమాన్ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి రాబోతున్న తదుపరి భారీ చిత్రం ‘మహాకాళి’ కీలక మైలురాయిని చేరుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 125 రోజుల పాటు సాగిన సుదీర్ఘ, భారీ షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించుకుని, ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ షెడ్యూల్లో చిత్రంలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా, యువ హీరో రోహిత్ సరాఫ్ తమకు సంబంధించిన షూటింగ్ భాగాలను పూర్తి చేసుకున్నారు. ఆర్.కె. దుగ్గల్ సమర్పణలో, ఆర్.కె.డి స్టూడియోస్ బ్యానర్‌పై పూజా కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డివైన్ యాక్షన్ డ్రామాలో భూమి శెట్టి కూడా నటిస్తున్నారు. ప్రేక్షకులకు సరికొత్త దృశ్యానుభూతిని పంచేందుకు ఈ సినిమాను ప్రత్యేకంగా ఐమాక్స్ (IMAX) ఫార్మాట్లో చిత్రీకరిస్తుండటం విశేషం. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీతో పాటు మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను ఇస్తామని చిత్ర యూనిట్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.