‘Gym Gym Tara’ Song | సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాలంటే కోట్లాది రూపాయల ప్రమోషన్ బడ్జెట్, స్టార్ హీరోల హంగామా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల క్యాంపెయిన్లు తప్పనిసరి అనే ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ సంప్రదాయానికి పూర్తి భిన్నంగా ఓ చిన్న సినిమా బృందం అత్యంత వినూత్నమైన ప్రమోషన్ వ్యూహంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎస్.ఎల్.టి. ఫిలిమ్స్ (SLT Films) పతాకంపై మంచి వెంకట్ నిర్మాణంలో, వై.జి. భరత్ దర్శకత్వంలో వస్తోన్న హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘పర్ణశాల’. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ అమలు చేసిన మార్కెటింగ్ స్కెచ్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ అనే పాట సినిమాపై ఒక్కసారిగా భారీ బ్యుజ్ క్రియేట్ చేసింది. సాధారణంగా ప్రచార చిత్రాలు లేదా రీల్స్ ద్వారా పాటలను జనాల్లోకి తీసుకెళ్లడం చూస్తుంటాం. కానీ ఈ చిత్ర యూనిట్ ఏకంగా లక్ష్మీదేవితో ఈ పాటకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్ హడావుడి లేకుండానే ఈ పాట నేరుగా సాధారణ ప్రేక్షకుల నోట నానుతుండటం విశేషం. మొబైల్ స్క్రీన్లకే పరిమితం కాకుండా పబ్లిక్‌లో ఈ పాటకు వస్తున్న ఆదరణ చూస్తుంటే మేకర్స్ వేసిన ప్లాన్ ఎంత సక్సెస్ అయిందో అర్థమవుతుంది.
సినిమా సక్సెస్‌లో కేవలం కంటెంట్ మాత్రమే కాకుండా, దానిని ప్రజలకు చేరవేసే విధానం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చిన్న సినిమాలకు భారీ బడ్జెట్ ప్రమోషన్స్ సాధ్యం కాని నేపథ్యంలో, కేవలం ఒకే ఒక్క క్రియేటివ్ ఐడియాతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లవచ్చని ‘పర్ణశాల’ టీమ్ నిరూపించింది. ఈ పాట సృష్టించిన జోష్ వల్ల సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవడమే కాకుండా, థియేట్రికల్ బిజినెస్ మరియు ఓటీటీ మార్కెట్‌పై కూడా సానుకూల ప్రభావం పడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ పాట తెచ్చిపెట్టిన హైప్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.