Rebel Movie | సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న జీవీ తాజాగా నటిస్తున్న చిత్రం ‘రెబెల్'(Rebel). మమితా బైజూ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో నికేష్ ఆర్ఎస్ తిరుపతి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ క్రమంలో మేకర్స్ దీపావళి కానుకగా టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ గమనిస్తే.. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో స్టూడెంట్స్, రాజకీయాల చుట్టూ ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు.
ఇక ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్, మమితా బైజు, కరుణాస్, సుబ్రమణ్య శివ, షాలు రహీమ్, వెంకటేష్ విపి, ఆదిత్య భాస్కర్, కోలేజ్ వినోద్, ఆదిరా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి అరుణ్ రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ చేస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఎడిటర్‌గా వేతి కృష్ణన్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఉదయ, ఫైటింగ్ కోచ్‌గా శక్తి శరవణన్ తదితరులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.