GV Narayana Rao | తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మరణ వార్తతో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, సహచర నటులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. జీవీ నారాయణరావు కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన, సినిమా రంగంలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనపై శిక్షణ తీసుకున్నారు. అనంతరం వెండితెరపై అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
1976లో విడుదలైన ‘అంతులేని కథ’ చిత్రం ద్వారా జీవీ నారాయణరావు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నటుడిగా పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తన కెరీర్లో ఆయన ‘ముత్యాల పల్లకి’, ‘అంగడి బొమ్మ’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు. అనేక టెలివిజన్ సీరియల్స్‌లో నటించి కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. నటనతో పాటు జీవీ నారాయణరావు నిర్మాతగా కూడా పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లి నీకు శుభం నాకు’ వంటి సినిమాలను నిర్మించి చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
వెండితెరపై నటుడిగా, తెరవెనుక నిర్మాతగా ఆయన చేసిన ప్రయాణం ఎంతో మందికి గుర్తుండిపోయేలా నిలిచింది. జీవీ నారాయణరావుకు సినీ పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు మంచి స్నేహం ఉండేదని సినీ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది నటీనటులతో కలిసి పనిచేసిన ఆయన, పరిశ్రమలో అందరితో ఆప్యాయంగా మెలిగేవారని చెబుతున్నారు.జీవీ నారాయణరావు మృతిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంది.దాదాపు పలు దశాబ్దాల పాటు నటుడిగా, నిర్మాతగా సినీ పరిశ్రమకు సేవలందించిన జీవీ నారాయణరావు ఇక లేరనే వార్త సినీ అభిమానులను కలచివేస్తోంది. ఆయన పోషించిన పాత్రలు, నిర్మించిన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారు.