అగ్ర హీరో గోపీచంద్ కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ డ్రామా ‘భరతవర్ష’. రీతూవర్మ కథానాయిక. సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత. గోపీచంద్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పవర్ఫుల్ గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టైటిల్‌ని నిర్మాతలు విడుదల చేశారు. క్రీ.శ 642 నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్ అద్భుతమైన యాక్షన్ సీన్స్‌తో కట్టిపడేసింది. భారీ యుద్ధ సన్నివేశాలు, ఆరితేరిన యోధుల క్లోజప్ షాట్స్. కత్తులు, గొడ్డళ్లు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు కనువిందు చేశాయి. భారతభూమికి ప్రతీకగా ‘భరతవర్ష’ అనే టైటిల్ రివీల్ కావడం కథపై ఆసక్తిని రేకెత్తించింది.
దేశ చరిత్రలో మరుగున పడిన ఓ అధ్యాయాన్ని దర్శకుడు సంకల్పరెడ్డి గొప్పగా ఆవిష్కరిస్తున్నారని, భావోద్వేగపూరిత కథా, కథనాలు, యాక్షన్ సన్నివేశాలతో సినిమా రూపుదిద్దుకుంటున్నదని నిర్మాతలు తెలిపారు. హీరో గోపీచంద్ యోధుడి పాత్ర కోసం తన శారీరకభాషను పూర్తిగా మార్చుకున్నారని, ఇందులో ఆయన ఫిజిక్, అభినయం, స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంటాయని, గత చిత్రాలకు భిన్నంగా గోపీచంద్ కనిపిస్తారని, చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నదని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరగుతున్నాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్, సంగీతం: అనుదీప్ దేవ్, సమర్పణ: పవన్‌కుమార్, నిర్మాణం: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్.