జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రా టీమ్స్ ఎలాంటి పోరాట పటిమను ప్రదర్శించారు? లక్ష్యసాధనలో శిక్షకుల సారథ్యంలో వారు అనుసరించిన వ్యూహాలేమిటో తెలుసుకోవాలంటే ‘సీటీమార్’ చిత్రం చూడాల్సిందే అంటున్నారు సంపత్‌నంది. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సెప్టెంబర్ 10న థియేటర్స్‌లో విడుదలకానుంది. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా, ఆంధ్రా టీమ్ కోచ్‌గా గోపీచంద్ నటించారు. మాస్, ఎమోషనల్ అంశాలతో ట్రైలర్ శక్తివంతంగా సాగింది. జాతీయ వేదికపై తమ బృందాల్ని గెలిపించుకునేందుకు గోపీచంద్, తమన్నా చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించింది. ‘రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్..రూట్ లెవల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు’…అని గోపీచంద్, ‘మనం ఇక్కడి నుంచి వెళ్లటం జరిగితే కప్పుకొట్టుకునే వెళ్లాలి’ అంటూ తమన్నా చెప్పే సంభాషణలు స్ఫూర్తివంతంగా సాగాయి. దిగంగన సూర్యవన్షీ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.సౌందర్‌రాజన్, సంగీతం: మణిశర్మ, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది.