భారతీయ పురాణాల్లో విజయానికి, యుద్ధానికి ప్రతీకలా భావించే దైవం కార్తికేయుడు. ఆయన ఇతివృత్తం ఆధారంగా కాల్పనిక అంశాల మేళవింపుతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే పేరు ప్రచారంలో ఉన్నది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. ఇందులో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్యస్వామి పాత్రలో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ లుక్ గురించి దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట.
వీఎఫ్ఎక్స్ టీమ్‌తో కలిసి ఎన్టీఆర్ లుక్‌పై వర్క్ చేస్తున్నారని తెలిసింది. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రం మేకింగ్‌లో విషయంలో ఎక్కడా పొరపాటు జరగకూడదని, తెరపై ఓ విజువల్ స్పెక్టకిల్‌ను ఆవిష్కరించాలనే సంకల్పంతో త్రివిక్రమ్ ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రాన్ని చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ సెట్స్‌మీదకు వెళ్లనుంది.