FWICE | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌కు పెద్ద ఉపశమనం లభించింది. ఆయనపై విధించిన నాన్-కోఆపరేషన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) బుధవారం ప్రకటించింది. ఫర్హాన్ అక్తర్ సినిమా ‘డాన్ 3’ నుండి రణవీర్ తప్పుకోవడంతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రణవీర్ సింగ్ సదరు సంస్థకు లీగల్ నోటీసు పంపిన కొద్ది గంటల్లోనే FWICE ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPAA), ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మరియు సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA)లు ఈ గొడవలో జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో సమస్య సర్దుమణిగినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై FWICE ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ మాట్లాడుతూ.. సినీ అసోసియేషన్ల అభ్యర్థన మేరకు రణవీర్ సింగ్‌పై ఉన్న నాన్-కోఆపరేషన్ ఆదేశాలను వెంటనే రద్దు చేస్తున్నాం. నిర్మాతలు, దర్శకులు లేదా నటులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం. ఈ గొడవలో ఎవరూ గెలవలేదు, ఎవరూ ఓడిపోలేదు. రణవీర్ పంపిన నోటీసుకు మా లీగల్ టీమ్ సమాధానం ఇస్తుంది అని చెప్పారు.
FWICE విధించిన ఈ నిషేధంపై రణవీర్ సింగ్ మంగళవారమే లీగల్ నోటీసు పంపారు. సినిమా కథలో మార్పులు స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడం మరియు షూటింగ్ ఆలస్యం అవుతుండటం వల్లే రణవీర్ ‘డాన్ 3’ నుండి తప్పుకున్నట్లు టాక్ నడిచింది. అయితే ఈ చిన్న విషయం కాస్తా పెద్దదై, నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ రణవీర్ నుంచి రూ. 45 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం, అలాగే FWICE ఆయనకు సహకరించకూడదని బ్యాన్ విధించడంతో ఇదొక పెద్ద లీగల్ ఫైట్‌గా మారింది. ఈ వివాదంపై రణవీర్ సింగ్ టీమ్ స్పందిస్తూ.. ప్రొఫెషనల్ విషయాలను ఎప్పుడూ గౌరవంగా, హుందాగా పరిష్కరించుకోవడానికే రణవీర్ ఇష్టపడతారని, అందుకే ఆయన ఈ గొడవపై సైలెంట్‌గా ఉన్నారని తెలిపారు.