Thalapathy Vijay Blockbuster Movies | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Vijay) తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ తన తొలి ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విషయం తెలిసిందే. 234 ఆసెంబ్లీ స్థానాలకు గాను 107 సీట్లను గెలుచుకుని తమిళనాడులోనే అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. అయితే అధికారం చెప్పట్టడానికి ఇంకా 11 సీట్లు అవసరం కావడంతో ఎవరితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదిలావుంటే విజయ్ నటించిన సినిమాలు తాజాగా హాట్ టాపిక్‌గా మారాయి.
విజయ్‌కి తెలుగు సినిమాలంటే మక్కువ ఎక్కువే అన్న ఎక్కువ సంగతి తెలిసిందే. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక తెలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను తమిళంలో రీమేక్ చేసి, అక్కడ కూడా భారీ విజయాలను అందుకున్నాడు విజయ్. ఆయన చివరి చిత్రం ‘జన నాయగన్’ కూడా ఒక తెలుగు సినిమా(భగవంత్ కేసరి)కు రీమేక్ కావడం విశేషం. అయితే ఆయన నటించిన రీమేక్ చిత్రాలు, హిట్ చిత్రాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇక విజయ్‌కి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన రీమేక్ సినిమాలను ఒకసారి చూసుకుంటే.!
ఘిల్లి (Ghilli): మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమాకు ఇది రీమేక్. విజయ్ కెరీర్లోనే ఇదొక మైలురాయిగా నిలిచింది.
పోక్కిరి (Pokkiri): పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ‘పోకిరి’ రీమేక్. తమిళంలో కూడా ఇది ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
బద్రి (Badri): పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాకు రీమేక్.
వశీగర (Vaseegara): వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకు రీమేక్.
ఆతి (Aathi): కళ్యాణ్ రామ్ నటించిన ‘అతనొక్కడే’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రం అక్కడ కూడ సూపర్ హిట్ అయ్యింది.
వేలాయుధం (Velayudham): నాగార్జున నటించిన ‘ఆజాద్’ సినిమాకు రీమేక్
యూత్ (Youth): వేణు నటించిన ‘చిరునవ్వుతో’ రీమేక్.
నినైతేన్ వందాయ్ (Ninaithen Vandhai): శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళి సందడి’ సినిమాకు రీమేక్.
ప్రియమానవలే (Priyamanavale): వెంకటేశ్ ‘పవిత్ర బంధం’ సినిమాకు రీమేక్.
నన్బన్ (Nanban): ఇది హిందీ సినిమా ‘3 ఇడియట్స్’ రీమేక్. అయితే దీనికంటే ముందే తెలుగులో కూడా ‘స్నేహితుడు’గా డబ్ అయి ప్రాచుర్యం పొందింది.
జన నాయగన్ (Jana Nayagan – 2026): బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఇది అధికారిక రీమేక్. విజయ్ నటించిన చివరి సినిమాగా ఇది వార్తల్లో నిలిచింది.
తెలుగులో రీమేక్ అయిన విజయ్ సినిమాలు
తిరుప్పాచ్చి – అన్నవరంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాను రీమేక్ చేశాడు
లవ్ టుడే – ఈ సినిమాను సుస్వాగతంగా రీమేక్ చేశాడు పవన్ కళ్యాణ్
కత్తి – ఈ సినిమాను ఖైదీ 150 గా రీమేక్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి
తుపాకీ – ఈ సినిమాను హాలీడేగా రీమేక్ చేశాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్
తుళ్లాదా మానామామ్ తుళ్లం – ఈ సినిమాను నువ్వు వస్తావనిగా రీమేక్ చేశాడు నాగార్జున
ఇక విజయ్ కేవలం తెలుగు సినిమాలను రీమేక్ చేయడమే కాకుండా, ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా భారీ వసూళ్లు సాధించాయి. ‘తుపాకీ’, ‘మెర్సల్’ (అదిరింది), ‘సర్కార్’, ‘బిగిల్’ (విజిల్), ‘మాస్టర్’, ‘లియో’ వంటి చిత్రాలు విజయ్‌కి తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టాయి. అయితే విజయ్ నటించిన ‘ఖుషి’ సినిమాను పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు అనుకుంటారు కానీ అది ద్విభాష చిత్రం. పవన్ కళ్యాణ్, విజయ్‌లను హీరోలుగా పెట్టి ఎస్ జే సూర్య ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ తమిళ ‘ఖుషి’ మొదట రిలీజ్ అయ్యింది.