Happy Birthday Mahesh Yadav | నటుడు మహేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి గ్రామం నుంచి వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మహేష్ యాదవ్. సినిమా అంటే పిచ్చి అభిమానంతో ఎలాగైనా నటుడిగా స్థిరపడాలనే పట్టుదలతో హైదరాబాద్ చేరుకున్న ఆయనకు అనుకోకుండా దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను కలిసే అవకాశం వచ్చింది. మహేష్ యాదవ్‌లోని సహజమైన నటనను, కామెడీ టైమింగ్‌ను గుర్తించిన తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో ల్యాబ్ అసిస్టెంట్ పాత్ర ఇచ్చారు. సినిమాలో ఆ పాత్ర నిడివి తక్కువైనా, మహేష్ యాదవ్ పలికిన డైలాగులు, పండించిన హావభావాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఆ తర్వాత వరుస అవకాశాలు ఆయన తలుపు తట్టాయి. ‘కీడా కోలా’ చిత్రంలో పొలిటిషియన్ సత్తి పాత్రతో మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో చేసిన కోటి సార్ పాత్రకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. వీటితో పాటు ‘ఓం శాంతి శాంతి’, ‘ప్రేమంటే’, ‘భామకలాపం’, ‘సత్తిగాని రెండెకరాలు’, ‘రాజుగాడు’, ‘నన్ను దోచుకుందువటే’, ‘అద్భుతం’, ‘జగమేమాయ’, ‘భీమ్లా నాయక్’, ‘స్కై ల్యాబ్’, ‘అథర్వ’, ‘శబరి’, ‘ఇంటింటి రామాయణం’, ‘ఉప్పు కప్పురంబు’, ‘త్రిబనదారి బార్బరిక్’, ‘మిత్ర మండలి’ వంటి పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో మెప్పించారు.
వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ తన సత్తా చాటారు మహేష్ యాదవ్. ‘రాముల’ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మి అనుచరుడు రామకృష్ణ పాత్రలో ఒదిగిపోయారు. అంతేకాకుండా ‘గాడ్సే అఫ్ ధర్మపురి’, ‘కుబుల్ హై’, ‘మాయాబజార్’, ‘శశి మధనం’, ‘శివరిపల్లి’, ‘సూపర్ సుబ్బు’ వంటి పాపులర్ వెబ్ సిరీస్‌లలో నటించి డిజిటల్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా ‘బద్మాషులు’ చిత్రంతో హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న డివోషనల్ డ్రామా ‘ఇరుముడి’లో ఫుల్ లెన్త్ రోల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా క్రేజీ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది 2’లోనూ మంచి లెన్త్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. వీటితో పాటు ‘సమ్మర్ హాలిడేస్’, ‘మారెమ్మ’, ఆనంద్ దేవరకొండ ‘తక్షకుడు’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలన్నీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ నటనపై ఇష్టాన్ని పెంచుకున్న మహేష్ యాదవ్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, కేవలం తన టాలెంట్‌తో, సహజమైన నటనతో, టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో అలరించాలని, మంచి స్థాయికి చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.