‘సమాజంలోని అసమానతల్ని చర్చిస్తూ తెరకెక్కించిన సందేశాత్మక చిత్రమిది. ఇందులో అవినీతిపరుడైన పోలీస్ అధికారిగా నటనకు ప్రాముఖ్యమున్న పాత్రలో కనిపిస్తా’ అని అన్నారు శ్రీకాంత్ అయ్యంగార్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘1997’. డా॥మోహన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ ‘నేటి సమాజంలో కుల, వర్ణ వివక్ష పెరిగింది. దేవుడు, మతం పేరుతో విద్వేషాల్ని సృష్టిస్తున్నారు. ఈ విషవలయంలో సామాన్యుడు ఎలా సమిధగా మారిపోతున్నాడనే అంశాలతో దర్శకుడు మోహన్ ఆలోచనాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నేను నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర చేశా. నా పాత్రలో నటిస్తున్న సమయంలో నిజంగా సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా అనే ఏహ్య భావన కలిగింది. నలభై ఏడేళ్ల వయసులో నటుడిగా నాకు బ్రేక్ వచ్చింది. ఆ పేరును నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నా’ అన్నారు.