Sony LIV Jazz City | ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (Sony LIV)లో ప్రసారమవుతున్న సరికొత్త పీరియాడిక్ డ్రామా సిరీస్ ‘జాజ్ సిటీ’ (Jazz City) ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం (Bangladesh Liberation War) నేపథ్యంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ప్రశంసలు అందుకుంటుడగా.. ఈ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు సౌమిక్ సేన్ తెరకెక్కించారు. అయితే ఈ సిరీస్‌లో కోల్‌కతాలో ఫేమస్ అయిన ఒక నైట్ క్లబ్ యజమాని ‘జిమ్మీ రాయ్’ అనే కీలక పాత్రలో బంగ్లాదేశ్ ప్రముఖ నటుడు ఆరిఫిన్ షువో(Arfin shuvoo) నటించిన సంగతి తెలిసిందే. అయితే స్థానిక భారతీయ నటులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఒక బంగ్లాదేశ్ నటుడిని ఎంపిక చేయడంపై ఇటీవల కొందరూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించాడు దర్శకుడు. ఆరిఫిన్ షువోని ఎంపిక చేయడంపై అసలు కారణాన్ని వెల్లడించాడు.
దర్శకుడు సౌమిక్ మాట్లాడుతూ.. ఈ కథకు చాలా ఫ్రెష్‌గా ఉండే నటీనటులు అవసరమని, ప్రేక్షకులు చూసిన వెంటనే ఎటువంటి పాత ముద్రలు లేకుండా నేరుగా పాత్రతో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పాత్ర కోసం చాలా మందికి ఆడిషన్స్ చేసినప్పటికీ, తాను ఊహించుకున్న ‘జిమ్మీ రాయ్’ పాత్రకు ఆరిఫిన్ షువో మాత్రమే పూర్తి న్యాయం చేయగలరనిపించిందని సౌమిక్ సేన్ తెలిపాడు. ఆరిఫిన్ కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు, ఎంతో మంచి నటుడని ఆయన ప్రశంసించారు. అలాగే సరిహద్దులు వేరైనా ఇరు దేశాల బెంగాలీల మధ్య భాష, సంస్కృతి పరంగా విడదీయరాని బంధం ఉందని, ఇలాంటి కథల్లో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని సౌమిక్ సేన్ తెలిపారు. గతంలో శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన బంగ్లాదేశ్ జాతిపిత ‘షేక్ ముజిబుర్ రెహమాన్’ బయోపిక్ ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’లో లీడ్ రోల్ ప్లే చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆరిఫిన్ షువో, ఇప్పుడు ‘జాజ్ సిటీ’లో తన నటనకు గాను విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.