జీవితం ఏం ప్రసాదించినా సానుకూల దృక్పథంతో స్వీకరించాలని..కుటుంబ బాధ్యతల బరువు మోస్తూనే కలల సాఫల్యానికి ప్రయత్నం చేయాలనే మానవీయ స్ఫూర్తితో రూపొందిన ‘కొడా’ (చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్) ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఆస్కార్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. వినికిడి లోపంతో బాధపడుతున్న కుటుంబానికి అన్నీ తానై నిలిచిన యువతి ైస్థెర్యానికి ప్రతీకలా ఈ సినిమా నిలిచింది. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘డ్యూన్’ ఆరు విభాగాల్లో అవార్డుల్ని సాధించి అగ్రభాగాన నిలిచింది. 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఆదివారం లాస్ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరిగింది. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ప్రేక్షకులు లేకుండానే ఈ వేడుకల్ని నిర్వహించారు. ఈసారి ఎలాంటి ఆంక్షల్ని విధించక పోవడంతో ఆస్కార్ వేడుకలు పూర్వపు హంగుల్ని సంతరించుకొని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించాయి.
కుటుంబానికి అండగా నిలిచిన ‘కొడా’
అమెరికన్ కామెడీ డ్రామాగా రూపొందిన ‘కొడా’ చిత్రానికి సియాన్ హేడర్ దర్శకత్వం వహించారు. ఫ్రెంచి చిత్రం ‘లా ఫామిలీ బిలియర్’ (2014) చిత్రానికి ఇంగ్లీష్ రీమేక్‌గా తెరకెక్కింది. రూబీ రోసి అనే యువతి స్ఫూర్తిదాయక జీవిత ప్రయాణానికి దృశ్యరూపమిది. ఆమె కుటుంబమంతా బధిరులే. రూబీ ఒక్కతే ఎలాంటి వైకల్యం లేని అమ్మాయి. ఆమెరికాలోని ఓ తీర పట్టణంలో రూబీ కుటుంబం చేపల వ్యాపారం చేస్తుంటుంది. యుక్తవయస్సు వచ్చాక కుటుంబ వ్యాపార బాధ్యతల్ని మొత్తం రూబీనే చూసుకుంటుంది. మరోవైపు గాయనిగా సంగీతప్రపంచంలో వెలిగిపోవాలన్నది ఆమె ఆశయం. ఓ సందర్భంలో కుటుంబ వ్యాపారం ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఈ క్రమంలో రూబీ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆమె చేసిన త్యాగం నేపథ్యంలో ఆద్యంతం హృద్యమైన ఫ్యామిలీ డ్రామాగా ‘కొడా’ చిత్రాన్ని రూపొందించారు. బలమైన భావోద్వేగాలలో పాటు సునిశితమైన కామెడీ కూడా ఈ సినిమాకు బలంగా నిలిచింది. ఎమిలియా జోన్స్ రూబీరోసీ పాత్రలో నటించింది. గతేడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వివిధ దేశాల్లో అనేక అవార్డులను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ సినిమాకుగాను బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో దర్శకురాలు సియాన్ హేడర్ ఆస్కార్‌ను గెలుచుకుంది. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన ట్రాయ్ కొట్సార్ ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్‌కు ఎంపికయ్యారు.
విల్‌స్మిత్‌కు తొలి ఆస్కార్..
‘కింగ్ రిచర్డ్స్’ చిత్రానికిగాను విల్‌స్మిత్ ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. విలక్షణ నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు విల్‌స్మిత్. భారతీయ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. హిందీ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో అతిథి పాత్రలో నటించారాయన. 30 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఆయనకిది తొలి ఆస్కార్ పురస్కారం కావడం విశేషం. గతంలో ‘అలీ’ (2022). ‘ది పర్ష్యూట్ ఆఫ్ హాపీనెస్’ చిత్రాలకుగాను ఆస్కార్‌కు నామినేట్ అయినప్పటికీ అవార్డును మాత్రం గెలుచుకోలేకపోయారు. ఈసారి మాత్రం ఆండ్రూ గార్ఫీల్డ్, బెనిడిక్ట్ కంబర్ బ్యాచ్, జేవియర్ బార్డెమ్, డెంజిల్ వాషింగ్టన్ వంటి దిగ్గజ నటుల్ని అధిగమించి అవార్డును దక్కించుకున్నారు. ‘కింగ్ రిచర్డ్’ చిత్రాన్ని స్పోర్ట్స్ బయోపిక్‌గా తెరకెక్కించారు. ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణులు వీనస్ విలియమ్స్, సెరేనా విలియమ్స్ తండ్రి రిచర్డ్ విలియమ్స్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తన కుమార్తెల ఆశయసాధనకు ఓ తండ్రి పడే తపన..ఓ మార్గదర్శిలా నిలిచి క్రీడా ప్రపంచంలో వారిద్దరిని సమున్నతంగా నిలిపిన ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఇందులో రిచర్డ్ విలియమ్స్ పాత్రలో విల్‌స్మిత్ తనదైన అద్భుతాభినయంతో మెప్పించారు.
ఉత్తమ నటి జెస్సికా ఛాస్టెన్
‘ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ’ చిత్రానికి గాను హలీవుడ్ నటి జెస్సికా ఛాస్టెన్ ఉత్తమ నటిగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకుంది. ఆమెకిది తొలి ఆస్కార్ కావడం విశేషం. ఈ సినిమాలో ఆమె టీవీ హోస్ట్, సింగర్, మత ప్రబోధకురాలైన టమ్మీ ఫాయే పాత్రలో నటించింది. భిన్న పార్శాల్లో సాగిన ఆమె నటన ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ‘ఇంటర్స్టెల్లర్’ ‘ది మార్టిన్’ ‘స్టోలెన్’ ‘లా లెస్’ వంటి చిత్రాలు జెస్సికా ఛాస్టెన్కు మంచి పేరుప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టాయి.
మధ్య వయస్కుడి అంతరంగం ‘డ్రైవ్ మై కార్’
ఆస్కార్ అవార్డుల్లో ఈ ధపా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్‌గా జపాన్ చిత్రం ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. ప్రముఖ జపాన్ రచయిత హరుకి మురాకామి రాసిన ‘మెన్ వితౌట్ విమెన్’ అనే కథాసంకలనం నుంచి సేకరించిన ముప్పై పేజీల కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మధ్య వయస్కుడైన ఓ నటుడికి ఓ మహిళా డ్రైవర్‌తో పరిచయం ఏర్పడుతుంది. వారి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? కుటుంబ సమస్యలతో అంతఃసంఘర్షణకులోనయ్యే ఆ నటుడు కొత్త పరిచయంలో ఎలాంటి స్వాంతన పొందాడనే అంశాలతో ఈ సినిమాను చక్కటి భావోద్వేగాలతో తెరకెక్కించారు. ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో పోటీపడిన భారతీయ చిత్రం ‘రైటింగ్ విత్ ఫైర్’కు నిరాశ ఎదురైంది.
సంచలనాల ‘ది పవర్ ఆఫ్ డాగ్’
‘ది పవర్ ఆఫ్ డాగ్’ చిత్రానికిగాను న్యూజిలాండ్‌కు చెందిన మహిళా దర్శకురాలు జేన్ కాంపియన్ ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. దర్శకత్వ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న మూడో మహిళగా ఆమె సంచలనం సృష్టించింది. 1925 నేపథ్యంలో సైకలాజికల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ‘ది పవర్ ఆఫ్ డాగ్’ సినిమాలో ఇద్దరన్నదమ్ముల జీవన ప్రయాణాన్ని ఆవిష్కరించారు. దర్శకురాలు జేన్ కాంపియన్కు ఇది రెండో ఆస్కార్ పురస్కారం కావడం విశేషం. గతంలో ‘పియానో’ (1993) చిత్రానికిగాను బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆమె అవార్డును కైవసం చేసుకుంది. మానవ సంబంధాల్లోని డొల్లతనాన్ని, స్వార్థాన్ని తన సినిమాల ద్వారా దృశ్యమానం చేస్తూ జేన్ క్యాంపియిన్ అద్భుత ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది.
వివాదంతో విల్‌స్మిత్
94వ ఆస్కార్ అవార్డుల ప్రదాన వేడుకలో ఓ అనూహ్య సంఘటన చేటుచేసుకుంది. ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్న విల్‌స్మిత్..స్టేజీ మీద ఉన్న ప్రజెంటర్, అమెరికన్ కామెడీ నటుడు క్రిస్‌రాక్ చెంపచెళ్లుమనిపించాడు. తన భార్య జాడా పింకెట్స్మిత్ బాల్డ్హెడ్పై క్రిస్‌రాక్ జోక్ పేల్చడంతో విల్‌స్మిత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయిచేసుకున్నాడు. అనారోగ్య కారణాలతో విల్‌స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గుండు చేయించుకుంది. ఈ విషయం తెలియక క్రిస్‌రాక్ మాట జారాడు. ‘జీ.ఐ.జేన్’ చిత్రంలో నటి డెమిమూర్ పాత్రతో పోల్చుతూ..ఆ సినిమా సీక్వెల్లో మీ భార్య నటించబోతుందా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో విల్‌స్మిత్ కోపోద్రిక్తుడయ్యారు. ఈ ఘటన అక్కడి ఆహూతుల్ని షాక్‌కు గురిచేసింది. అనంతరం తాను చేసిన పనికి విల్‌స్మిత్ క్షమాపణ చెప్పారు. అవార్డు స్వీకరించిన సమయంలో విల్‌స్మిత్ భావోద్వేగంగా ప్రసంగించారు. ‘కళ జీవితాన్ని అనుకరిస్తుంది. ప్రేమ మిమ్మల్ని ఉన్నతమైన కార్యాల్ని చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. అవార్డు పొందినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు రావడం లేదు. మీ అందరి మీద వెలుగుల్ని ప్రసరించాననే సంతోషంతో ఎమోషనల్ అయ్యా’ అని విల్‌స్మిత్ చెప్పారు.
‘డ్యూన్’..‘కొడా’లకు అవార్డుల పంట
సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘డ్యూన్’..ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్, ప్రొడక్షన్ డిజైన్, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఆస్కార్ గెలుచుకొని సత్తాచాటింది. ఈ సెంటిఫిక్ థ్రిల్లర్‌కు డెనిస్ విల్లెవ్ దర్శకత్వం వహించారు. అత్యద్భుతమైన గ్రాఫిక్ హంగులు, సాంకేతికంగా ఉన్నతమైన ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆంగ్ల రచయిత ఫ్రాంక్ హెర్బర్ట్ 1965లో రాసిన ‘డ్యూన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. అనంత విశ్వంలో భూమి కాకుండా మరే ఇతర గ్రహాల మీద జీవం ఉండే పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుందనే ఊహ నుంచి ఈ సినిమా కథను రాసుకున్నారు. జన్మతః అసాధారణ శక్తుల్ని ప్రదర్శించే ఓ యువకుడు తన కుటుంబంతో సహా సుదూరంగా ఉన్న ఓ ఏడారి గ్రహానికి పయనమవుతాడు. అక్కడ అతనికి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. రెండు గ్రహాలు..అక్కడి ఆధిపత్య శక్తుల మధ్య జరిగే పోరులో అతను చిక్కుకుంటాడు. దుష్టశక్తులతో అతను సాగించిన పోరాటం నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమాను రూపొందించారు. గత ఏడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ‘కొడా’ (చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్) చిత్రం మూడు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది.
ఈ ఏడాది హైలైట్స్..
ఆస్కార్ అవార్డు గ్రహీతల వివరాలు..
ఉత్తమ చిత్రం: కొడా
ఉత్తమ నటుడు: విల్‌స్మిత్ (కింగ్ రిచర్ట్స్)
ఉత్తమ నటి: జెస్సికా ఛాస్టెన్ (ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ)
ఉత్తమ దర్శకురాలు: జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ డాగ్)
ఉత్తమ సహాయనటి: అరియానా దిబోస్ (వెస్ట్‌సైడ్ స్టోరీ)
ఉత్తమ సహాయనటుడు: ట్రాయ్ కోట్సార్ (కొడా)
ఉత్తమ డాక్యుమెంట్రీ ఫీచర్: సమ్మర్ ఆఫ్ సోల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: గ్రెగ్ ఫ్రెజర్ (డ్యూన్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: బెల్ఫాస్ట్ (కెన్నత్ బ్రానా)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జెన్నీ బీవన్ (క్రూయెల్లా)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం : డ్రైవ్ మై కార్ (జపాన్)
ఉత్తమ యానిమేటెడ్ చిత్రం: ఎన్కాంటో
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్