The Great Pre Wedding Show | తెలంగాణ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం 2025 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్’లో “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో” చిత్రం సత్తా చాటి రెండు కీలక విభాగాల్లో పురస్కారాలను కైవసం చేసుకుంది. సామాజిక విలువలతో కూడిన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు గానూ ప్రభుత్వం ‘థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ (మూడవ ఉత్తమ చిత్రం) అవార్డును ప్రకటించింది. కేవలం చిత్రానికే కాకుండా, అందులో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న బాల నటుడు మాస్టర్ రోహన్ రాయ్‌కు ‘ఉత్తమ బాల నటుడు’ (Best Child Artist) పురస్కారం లభించడం విశేషం. గద్దర్ పేరుతో ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకే సినిమాకు రెండు కీలక పురస్కారాలు దక్కడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. వినూత్నమైన కథనం, భావోద్వేగపూరితమైన సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమాను ప్రభుత్వం గుర్తించడం పట్ల సినీ విశ్లేషకుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. కళలకు మరియు కళాకారులకు ఇచ్చే ఈ గౌరవం భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు రావడానికి ప్రోత్సాహాన్నిస్తుందని ఈ సందర్భంగా చిత్ర బృందం పేర్కొంది.