సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నేను.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం దొరికతే చాలు అనుకున్నాను. ఈ రోజు పక్క రాష్ట్రంలోని అగ్రనటుడితో సినిమా చేసి హిట్ కొట్టాను. ఇదంతా ఎలా జరిగిందో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కష్టపడి పనిచేయడం ఒక్కటే నా చేతుల్లో ఉందని నమ్ముతాను. దర్శకులకు ప్రతి సినిమా మొదటి సినిమానే. ప్రతిసారి మమ్మల్ని మేము నిరూపించుకోవాలి. నా తదుపరి చిత్రాన్ని కూడా మరో చాలెంజ్‌గా స్వీకరిస్తాను’ అన్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. దళపతి విజయ్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో దిల్ రాజు శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మించిన చిత్రం ‘వారసుడు’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లితో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
వారసుడు’ చిత్రానికి వస్తున్న స్పందన ఎలా ఉంది?
వారసుడుకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా వుంది. నేను తమిళంలో తీసిన మొదటి సినిమానే సూపర్‌హిట్ అయింది. తెలుగులో అతి తక్కువ సమయంలోనే ‘మాస్టర్’ వసూళ్లను దాటబోతుంది. పబ్లిసిటికి సమయం దొరకలేదు. అయినా మా సినిమాకు ప్రేక్షకులు మౌత్‌టాక్‌తో పెద్ద విజయాన్ని అందించారు.
ఈ సినిమా విషయంలో మీరు అనుకున్న విజయాన్ని అందుకున్నారా?
మొదటి నుంచి మా నమ్మకానికి తగినట్లే మంచి విజయం దక్కింది. ఈ చిత్ర ఫలితంపై నిర్మాత దిల్ రాజు ఆనందంగా ఉన్నారు. బాక్సాఫీస్ ఫలితంపై నిర్మాత స్పందన చూసి ప్రేక్షకుల అభిప్రాయాన్ని అంచనా వేశారు అనిపించింది. నిర్మాతకు డబ్బుతో పాటు గౌరవం తెచ్చిపెట్టిన సినిమా ఇది.
ఈ చిత్రం తమిళ కథానాయకుడితో చేయడానికి కారణం?
కథానాయకుడు విజయ్ దేశవ్యాప్తంగా ఓ పెద్దస్టార్. ఆయనకు విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన బలాలు నాకు తెలుసు. ఆయన బాగా గుర్తింపు పొందిన పాత్రల ఇమేజ్‌ని వెండితెరపైకి మళ్లీ తీసుకురావడానికి ఈ చిత్రాన్ని రూపొందించాను. కథే హీరోని వెతుక్కుంటూ వెళ్తుంది అని నమ్ముతాను. పెద్ద హీరోలు అవసరమయ్యే పెద్ద కాన్వాస్ సినిమాలు తీయాలని నేను నమ్ముతాను. నా సినిమాలో ప్రతి పాత్ర ఉండడానికి ఒక జస్టిఫైడ్ రీజన్ ఉంటుంది.
ఈ సినిమాకు మీరు అందుకుంటున్న ప్రశంసలు ఎలా వున్నాయి?
‘వారసుడు’ సినిమాలో తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో టచ్ చేశారంటూ ప్రతి రోజు నాకు కాల్స్ వస్తున్నాయి. మా నాన్న గారు సినిమా చూసి నన్ను హత్తుకుని పొంగిపోయి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.
తమిళంలో విడుదల చేసిన తరువాత తెలుగులో విడుదల చేశారు ఎందుకని?
‘వారసుడు’ చిత్రాన్ని తమిళంలో మాత్రమే చిత్రీకరించి తెలుగులోకి డబ్ చేశాం. విడుదల తేదీ నిర్ణయం పూర్తిగా నిర్మాతదే. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్స్ సినిమాలు చూసిన అందరూ తమిళ స్టార్ విజయ్ సినిమా కూడా చూస్తున్నారు. వారసుడు తెలుగులో కూడా తప్పకుండా సూపర్‌హిట్ అవుతుందని దిల్‌రాజు గారు నమ్మారు. అది నిజం అయింది.
మీ కథలన్నీ కుటుంబ భావోద్వేగాల నేపథ్యంగా ఉంటాయి. ఎందుకని?
నా సినిమాలన్నింటికీ అమ్మా నాన్నల భావోద్వేగాలే మూలం. ‘వారసుడు’లో తండ్రికొడుకులు కాంపిటీటివ్‌గా ఉండాలని కోరుకుంటారు. తల్లి నిజం, తండ్రి నమ్మకం. నేను దానిని నమ్ముతాను. తెరపై చూపించాను.