పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని నటీనటుల్లో తానూ ఉంటానని రుజువు చేసుకున్నది తెలంగాణ కోడలుపిల్ల రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అందాలభామ ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి డూప్ లేకుండా దూకిందంటూ ఆ చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో చేతులకు, కాళ్లకు గాయాలైనా విరామం తీసుకోకుండా రష్మిక షూట్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ అనుభవాలను స్వయంగా రష్మిక కూడా పంచుకున్నది. ‘కొచ్చిలో జరిగిన ‘మైసా’ షూటింగ్ నాకెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. చిన్నప్పట్నుంచీ నాకు హైట్ నుంచి కిందికి చూడటం భయం. కానీ ఈ షూటింగ్ పుణ్యమా అని ఆ భయాన్ని జయించాను.
యాక్షన్ సీక్వెన్స్ శిక్షణ కోసం ఉదయాన్నే అలారం పెట్టుకొని లేచేదాన్ని. తక్షణశక్తి కోసం నాకెంతో ఇష్టమైన పళం పూరీలను కడుపునిండా తినేదాన్ని. మోకాళ్లకు గాయాలైనా పట్టు వదలకుండా పోరాడటం, ఆ కేరళ అడవులు, భారీగా కనిపించే కీటకాలు, పరవళ్లు తొక్కే జలపాతాలు, వర్షాలు, వర్కౌట్లు, ట్రెక్కింగులు.. ఇలా ప్రతిదీ ఓ గొప్ప అనుభవమే. నిజంగా ఈ షూట్లోని ప్రతిక్షణాన్నీ ఆస్వాదించా’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.