Devagudi | బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “దేవగుడి” చిత్రం జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కుల వ్యవస్థ నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ : రాయలసీమలోని దేవగుడి గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథలో ఫ్యాక్షన్ లీడర్ దేవగుడి వీరారెడ్డి (రఘు కుంచె) ఊరి ప్రజలకు ఆప్తుడు. కానీ తన అనుచరుడి కుమారుడైన ధర్మ (అభినవ్ శౌర్య), తన కొడుకు (నరసింహ)తో సమానంగా పెరగడాన్ని అతను జీర్ణించుకోలేడు. తన కుమార్తె శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందని తెలిసి వీరారెడ్డి అతన్ని ఊరి నుంచి గెంటిస్తాడు. ఆ తర్వాత వీరారెడ్డి అనారోగ్యం పాలుకావడం, అనుచరుల హత్యలు, శ్వేత అదృశ్యం వంటి మలుపులతో కథ ఆసక్తికరంగా మారుతుంది. చివరకు ధర్మ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు, వీరారెడ్డిలో మార్పు వచ్చిందా అనేదే అసలు కథ.
విశ్లేషణ: సామాజిక సమస్య అయిన కుల వివక్షను ప్రశ్నిస్తూ దర్శకుడు రామకృష్ణా రెడ్డి ఈ కథను ఆవిష్కరించారు. కథాంశం కొంత పాత సినిమాలను గుర్తు చేసినప్పటికీ, రాయలసీమ నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను బోర్ కొట్టించదు. మనిషి ఆధునిక యుగంలో ఉన్నా ఇంకా కుల వ్యవస్థలోనే మగ్గిపోతున్నాడనే పాయింట్‌ను దర్శకుడు బలంగా చూపించారు. స్క్రీన్ ప్లే ఊహించదగ్గదే అయినా, క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. పరిమిత బడ్జెట్లో కూడా రిచ్ విజువల్స్, మంచి పాటలతో కమర్షియల్ హంగులు తగ్గకుండా సినిమాను మలిచారు.
నటీనటుల ప్రతిభ: కొత్తవారైనప్పటికీ అభినవ్ శౌర్య, అనుశ్రీ, నరసింహ తమ పాత్రల్లో చక్కని ఈజ్‌తో నటించారు. ఫ్యాక్షన్ లీడర్‌గా రఘు కుంచె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. రఘుబాబు, రాకెట్ రాఘవ, మీసాల లక్ష్మణ్ తమ కామెడీతో నవ్వించారు. సాంకేతికంగా మదిన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కథకు బలాన్ని ఇచ్చాయి. నిర్మాణ విలువలు సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.
ముగింపు: “దేవగుడి” సమాజంలోని కుల వివక్షను ప్రశ్నిస్తూనే, మంచి భావోద్వేగాలతో సాగే కమర్షియల్ డ్రామా. సందేశాత్మక చిత్రాలను, కమర్షియల్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ఎంపిక.