Dacoit | టాలీవుడ్ యువ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో, అందాల నటి మృణాల్ ఠాకూర్ కథానాయికగా తెరకెక్కిన ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల సమ్మేళన చిత్రం ‘డెకాయిట్’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. అయినప్పటికీ మంచి వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తనదైన గుర్తింపు తెచ్చుకుంది.దాదాపు మూడు వారాల పాటు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వేదికలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియా ఈ చిత్రాన్ని నేటి నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే ప్రసారం అవుతోంది. హిందీ వెర్షన్ ఇంకా విడుదల కాకపోవడం ఉత్తరాది ప్రేక్షకులను కొంత నిరాశకు గురిచేస్తోంది. అయితే త్వరలోనే ఆ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అడివి శేష్ మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకోగా, మృణాల్ ఠాకూర్‌తో ఆయన జోడీ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ప్రేమ కథతో పాటు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.
ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా, సుప్రియ యార్లగడ్డ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. భారీ నిర్మాణ విలువలు కూడా సినిమాకు మరో బలంగా నిలిచాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం పొందారు. యాక్షన్, ఉత్కంఠభరిత కథలను ఇష్టపడే వారికి ‘డెకాయిట్’ మంచి వినోదాన్ని అందించనుంది.