Dharani I Love You | టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాత, కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తాజాగా మరో కొత్త సినిమాకు అండగా నిలిచారు. సాయికృష్ణ కె.వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ధరణి ఐ లవ్ యు’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ వేడుకలో ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమా పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు.
పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఎస్కేఎన్ మాట్లాడూతూ.. ‘ధరణి ఐ లవ్ యు’ టైటిల్ ఎంతో క్యాచీగా ఉండటంతో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి, క్యూరియాసిటీ పెరుగుతున్నాయని ప్రశంసించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సాయికృష్ణ కె.వికి ఇది రెండో సినిమా అని, ఆయన గతంలో టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చారిత్రాత్మక విజయం సాధించిన ‘మగధీర’ చిత్రానికి అసోసియేట్ దర్శకుడిగా పని చేసిన అనుభవం ఉందని గుర్తుచేశారు. ఈ సినిమాను నిర్మిస్తున్న నిర్మాత రాజశేఖర్ మద్దికుంటతో పాటు చిత్ర బృందమంతా ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారని, ఈ చిత్రం ఘన విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సాయికృష్ణ కె.వి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, టైమింగ్ ఉన్న డైలాగ్స్, ప్రాక్టికల్ ఆలోచనలతో దూసుకుపోతున్న కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేతుల మీదుగా తమ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ అవ్వడం తమ బృందానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘బేబీ’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి వరుస విజయాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసి బ్లెస్ చేసిన ఎస్కేఎన్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్కేఎన్ స్టేజ్ మీద చెప్పే రైమింగ్, పంచ్ టైమింగ్‌కు తాను ఎంతో పెద్ద ఫ్యానని, ఆయనలాంటి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ చేతుల మీదుగా సినిమా ప్రయాణం మొదలుకావడం శుభపరిణామమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత రాజశేఖర్ మద్దికుంట, హీరో వంశీ, హీరోయిన్ మహిత తదితరులు మాట్లాడుతూ.. సినిమా ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ మరియు ఎమోషనల్ హంగులతో అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ట్రైలర్ తేదీలను అధికారికంగా వెల్లడిస్తామని చిత్ర బృందం స్పష్టం చేసింది.
ఈ చిత్రానికి శ్రీమతి బాలామణి సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, కామన వి.సాయి మరియు బాలసూర్య సంయుక్తంగా మాటలు అందిస్తున్నారు. ఉమా వంగూరి, చాందిని, విశ్వనాధ్ కారసాల రాసిన పాటలకు పద్మనాబ్ భరద్వాజ్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నందమూరి హరి, ఎన్.టి.ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, చిన్నయోగి అన్నెం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జగన్.బి ఆర్ట్ డైరెక్టర్‌గా, దేవరాజ్, నందు, జీవన్ ఫైట్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రకిరణ్ కొరియోగ్రఫీ చేయగా, లోకేష్ కాస్ట్యూమ్స్, రాఘవ మేకప్ బాధ్యతలు చూసుకుంటున్నారు. పబ్లిసిటీ నవీన్ నంద్యాల, పి.ఆర్.ఓగా కడలి రాంబాబు వ్యవహరిస్తుండగా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను సాయికృష్ణ కె.వి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.