Chiranjeevi | టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ సినీ ప్రయాణంలో అరుదైన మైలురాయి చేరుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఏకంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన అభిమానులు చేసిన సేవా కార్యక్రమం ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది. తమ అభిమాన హీరో నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడేలా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. ఆల్ ఇండియా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో 43 మంది అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తమ అభిమానాన్ని సేవగా మార్చిన వెంకీమామ అభిమానులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున మెగాస్టార్ చిరంజీవి, ఆల్ ఇండియా వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణకు ప్రత్యేక అభినందన లేఖను పంపించారు. తన ఆప్తమిత్రుడు వెంకటేష్‌తో ఉన్న అనుబంధాన్ని ఆ లేఖలో చిరంజీవి హృదయపూర్వకంగా ప్రస్తావించారు. నాలుగు దశాబ్దాలుగా తన ప్రత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న వెంకటేష్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. కుటుంబ కథా చిత్రాల నుంచి విభిన్నమైన పాత్రల వరకు వెంకటేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆయన ఇలాగే మరెన్నో సంవత్సరాలు ప్రేక్షకులను అలరిస్తూ, తన కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
అలాగే వెంకటేష్ అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కూడా చిరంజీవి ప్రత్యేకంగా కొనియాడారు. ఒక హీరో సినీ ప్రస్థానంలో ముఖ్యమైన మైలురాయిని సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంతో జరుపుకోవడం నిజంగా అభినందనీయమని తెలిపారు. అభిమానం కేవలం హీరోలపై ప్రేమను వ్యక్తం చేయడంలోనే కాకుండా, సేవా రూపం దాల్చినప్పుడు సమాజానికి ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని చిరంజీవి ప్రశంసించారు. రక్తదాన శిబిరం నిర్వహించిన నిర్వాహకులతో పాటు స్వచ్ఛందంగా రక్తం అందించిన 43 మంది అభిమానులను ‘బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’గా అభివర్ణిస్తూ చిరంజీవి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారు చేసిన రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వెంకటేష్ అభిమానులు ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు.