చిరంజీవి!.. కలలో ఎవరు పిలిచారో? ఎందుకు పిలిచారో? శివశంకర వరప్రసాద్ ఆనాటి నుంచి చిరంజీవి అయ్యాడు. ఆ పిలిచిన వ్యక్తి ఎవరో తెలియదు! ఏ క్షణంలో పిలిచాడో.. చిరంజీవి సుప్రీం హీరో అయ్యాడు. మెగాస్టార్ అయ్యాడు. ఎందరు పోతున్నా… మరెందరు వస్తున్నా… మెగాస్టార్ ఒక్కడే! చిరంజీవి ఒక్కడే!! పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరు కథ..
Mega Star Chiranjeevi | సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఒకరోజు నిర్మాత క్రాంతికుమార్ కస్సుమన్నాడు.. చిరంజీవి నొచ్చుకున్నాడు కానీ, కిక్కురుమనలేదు. ఆ వినయం, వివేచనే అతని కెరీర్‌కు ‘పునాదిరాళ్లు’ అయ్యాయి!
బాపు నుంచి పిలుపు. ‘మనవూరి పాండవులు’లో అర్జునుడి తరహా పాత్ర. అందులో ఒక సీన్.. అందరూ అలా వచ్చి భోజనానికి కూర్చోవాలి. సాదాసీదాగా వస్తే చిరంజీవి ఎందుకు అవుతాడు. సీనుకు ముందు.. షర్ట్ మీద, తలలో కాస్త గడ్డిపరకలు తగిలించుకొని, వాటిని దులుపుకొంటూ వచ్చి కూర్చున్నాడు. కెమరామెన్కు అర్థమైంది. ‘అబ్బో! అసాధ్యుడే’ అనుకున్నాడు. ఏ డైలాగ్ లేనిచోట కూడా ఆడిటోరియం దృష్టిని ఆకర్షించే టెక్నిక్ చిరంజీవికి రెండో సినిమా నుంచే అబ్బింది.
బాలచందర్ దృష్టి పడింది. ‘ఇది కథ కాదు’లో చిరు పాత్ర పండింది!! ‘కోతలరాయుడు’ రిలీజైంది… మొదటిసారి హీరో డ్యాన్సులకు థియేటర్ స్క్రీన్లపై నోట్ల వర్షం కురిసింది. హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్నా… సహనటుడి పాత్రలొస్తే వద్దనలేదు. విలనీ చేశాడు. కామెడీ చేశాడు. ఓ సినిమాలో భయపడ్డాడు… ఇంకో సినిమాలో భయపెట్టాడు. మొత్తంగా చిరంజీవి దర్శక, నిర్మాతలకు ప్రయోగశాలగా మారాడు. ఎంత మారాలనుకున్నా మారలేక, మారుతున్న దేహాన్ని కాపాడుకోలేక ‘పున్నమినాగు’లో మిన్నాగు కన్నా భయంకరంగా పగ సాధించిన వైనాన్ని ఎలా మర్చిపోగలం? లవర్ బాయ్‌గా, క్లెవర్ ఎనిమీగా ‘న్యాయం కావాలి’లో మరో విలనీ క్యారెక్టర్!
వరుస అవకాశాలు.. వెనకాలే విజయాలు. నిర్మాతలకు లంకెబిందె దొరికినట్టు అనిపించింది. దర్శకులకు ఊట బావి దారి తెలిసింది. తోడుకున్నంత తోడుకోవచ్చు అని వాళ్ల అభిప్రాయం. పెట్టిందానికి పదింతలు పక్కాగా వస్తుందని నిర్మాత కృతనిశ్చయం. ఈ మెరుపు నటుడికి.. కోదండరామిరెడ్డి అనే ఉరుము జతకలిసింది. ఈ జోడీకి యండమూరి తోడయ్యాడు. వీరందరికీ ఇళయరాజా సూటయ్యాడు. ఇంకేముంది ‘యురేకా సకామికా…’! సినిమా మీద వాళ్ల ‘అభిలాష’ తీరేదాకా… విరుచుకుపడ్డారు. ఫక్తు ప్రయోగాత్మక సినిమా ‘అభిలాష’. దీన్ని పక్కా కమర్షియల్ సినిమాగా తీసేశారు.
ఇందులో అమాయక చిరంజీవి, జాయ్‌ఫుల్ చిరంజీవి, బెదిరిపోయే చిరంజీవి, బెదిరించే చిరంజీవి.. ఒక్క టికెట్ మీద పది పాత్రలు వండి వడ్డించాడు. చిరు, కోదండరామిరెడ్డి హిట్ ఫార్ములా! కథ ఎవరిదైనా వీరిద్దరూ కలిశారంటే హిట్టు. మ్యూజిక్ ఎవరైనా వీరిద్దరి సినిమా అంటే హిట్టు. ‘ఖైదీ’ ఓపెనింగ్ సీన్ చాలు… చిరంజీవిని దర్శకుడు కోదండరామిరెడ్డి ఏ రేంజ్లో చూపించాడో చెప్పడానికి. ‘ఛాలెంజ్’ చాలు వీరిద్దరి కాంబినేషన్‌కు తిరుగులేదని చెప్పడానికి. కె.విశ్వనాథ్, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, విజయబాపినీడు ఇలా ఒక్కో దర్శకుడు చిరంజీవిని ఒక్కో రేంజ్లో చూపించారు.
ఈ యాక్షన్ హీరోలో కామెడీ పాళ్లూ ఎక్కువే! ఎంత పర్ఫెక్ట్గా పవర్ పంచ్ ఉంటుందో.. కామెడీ టైమింగూ అంతే ఇదిగా పండుతుంది. ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో బాపూ స్టయిల్లో ముళ్లపూడి వారి టైమింగ్‌ను అందుకున్న చిరంజీవి… దర్శకుడు జంధ్యాల ‘చంటబ్బాయ్’లో డిస్టింక్షన్లో పాసయ్యాడు. ‘వెల్కమ్ మిస్ జ్వాలా..’ సన్నివేశం ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తుంది. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తుంది. నవ్వాలనుకున్నప్పుడల్లా ఆ సీను గుర్తొస్తుంది. ‘జేబుదొంగ’లో స్టీల్‌ప్లాంట్ బాబాయ్ వేషాలు గుర్తున్నాయిగా! అప్పుడెప్పుడో మొదలైన కామెడీ చిరంజీవి ప్రతి సినిమాలోనూ ఉంటుంది. పరిధి మేరకే ఉన్నా… అపరిమితంగా ఆకట్టుకుంటుంది.
‘దొంగమొగుడు’లో కాళ్లు, కళ్లు లేనివాడిగా నటిస్తూ బ్లాక్ టికెట్లు అమ్ముతుంటాడు చిరంజీవి. పోలీసులు అటకాయిస్తే.. ‘నాకు కళ్లొచ్చాయ్.. నేనన్నీ చూడగలుగుతున్నా! నాకు కాళ్లొచ్చాయ్ నేను నడవగలుగుతున్నా..’ అని లగెత్తుకొని పరిగెత్తడం చూసి ప్రేక్షకులు వేసిన ఈలలు ఆయన అభిమానులకే కాదు, హాస్యాన్ని ఇష్టపడే వారందరికీ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ‘రౌడీ అల్లుడు’లో ఆటోజానీగా చిరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు! ‘గ్యాంగ్‌లీడర్’లో ‘శబరి..’ అంటూ తన బామ్మను ఆటపట్టించిన వైనం చిరుకే చెల్లు. ఇలా ఎన్ని సినిమాలని గుర్తు చేసుకుంటాం… ఆనాటి ‘కోతల రాయుడు’ నుంచి ఈనాటి ‘వాల్తేరు వీరయ్య’ వరకు పరికిస్తే… ఈ ‘శంకర్‌దాదా’ హాస్యం పండించడంలో ఎంబీబీఎస్ చేశాడేమో అనిపించకమానదు.
‘మనవూరి పాండవులు’ షూటింగ్ సమయంలో… రాత్రిళ్లు డ్యాన్స్ చేస్తూ.. ‘ఎప్పటికైనా ఈ స్టెప్పులతో ఇండస్ట్రీని ఊపేస్తా’ అనేవాడట చిరంజీవి. మాటవరుసకు అన్నమాట కాదిది. బాడీలో స్ప్రింగ్‌లు మింగేసినంత స్వింగేం ఉండదు. ఎముకల్ని అతిగా మెలికలు తిప్పెయ్యడు. భరించలేనంత వేగం ఉండదు. కానీ, అతని చూపులోనే ఓ ఊపు కనిపిస్తుంది. అతగాడు రిథమిక్‌గా కాళ్లు కదిపేస్తుంటే.. చూడముచ్చటగా ఉంటుంది. చూసినవాళ్లకూ చేయాలనిపిస్తుంది. అలా చూసి, నేర్చుకొని, చిరంజీవిని గురువుగా భావించి కొరియోగ్రాఫర్లు అయినవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు తమ గురువుకు నృత్యరీతులను సమకూర్చి ‘జై చిరంజీవ’ అనుకుంటున్నారు.
డ్యాన్స్ మాత్రమే కాదు.. ప్లేబ్యాక్ సింగర్ డైనమిక్స్‌కు నూరు శాతం న్యాయం చేసే నటుల్లో ముందువరుసలో ఉంటాడు. ఇళయరాజా, చక్రవర్తి, రాజ్-కోటి, బప్పీలహరి, మణిశర్మ ఇలా ఎందరో సంగీత దర్శకులు చిరు రిథమ్‌కు తగ్గట్టుగా ట్యూన్లు ఇచ్చారు. వేటూరి పాటకు వాటంగా నర్తించే అతని పాటవం మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇన్ని క్వాలిటీలు చిరంజీవిని మెగాస్టార్‌ను చేశాయి. ఆయన కెరీర్లో మెగా హిట్లు, బంపర్ హిట్లతోపాటు కొన్ని సూపర్ ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. కానీ, నటుడిగా చిరు ఫెయిలైన పాత్ర ఇప్పటి వరకూ లేదు. ఇకముందూ ఉండదు!
చెప్పులు కుట్టేవాడిగా మెప్పించాడు. ‘జేబుదొంగ’గా అలరించాడు. ‘రౌడీ అల్లుడు’గా నవ్వించాడు. ‘గ్యాంగ్‌లీడర్’గా రఫ్ఫాడించాడు. ‘ఘరాగా మొగుడు’గా ఆల్‌టైమ్ రికార్డ్స్‌కు కొత్త టర్నింగిచ్చాడు. ‘ఇంద్ర’గా అదరగొట్టాడు. ‘ఠాగూర్’గా ప్రశ్నించాడు. మరింత విస్తృతంగా ప్రజాసేవ చేయాలని గ్యాప్ తీసుకున్నాడు. అయిష్టంగానే సినిమాకు దూరమయ్యాడు. అనవసరంగా దూరమయ్యాడని అభిమానులు బాధపడ్డారు.
కాలం ఎంతో విలువైనది. పదేండ్ల కాలం.. ఇంకెంతో విలువైనది. పాతికేండ్ల నుంచి అరవై ఏండ్ల జీవనయానంలో మూడోవంతు సమయమిది. చేసే పనికి, వచ్చిన పనికి, నచ్చిన పనికి ఓ పదేండ్లు దూరమైతే! అతని పనైపోయినట్టే!! చిరంజీవి కూడా పదేండ్లు కోల్పోయాడు. కారణాలేవైనా ఫుల్‌స్వింగ్‌లో ఉన్న కాలాన్ని వదిలేసుకున్నాడు. మళ్లీ వస్తే… ‘ఆ టైమింగ్ అందుకుంటాడా..?!’ కొందరి డౌటు! ‘ఖైదీ నంబర్ 150’ ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేసింది. ‘వాల్తేరు వీరయ్య’తో మెగా రేంజ్ తెలిసొచ్చింది. రాబోయే ‘విశ్వంభర’ మరో జగదేకవీరుణ్ని కండ్లముందు ఉంచుతుంది. నో డౌట్!!
చివరగా ‘చిరూ! బాలూ చెప్పినట్టు… నీ నటనా గనిలో చెరగని పాత్రలెన్నో నివురుగప్పి ఉన్నాయి. తరగని నీ కీర్తికి అరగని రికార్డులెన్నో సాక్ష్యంగా ఉన్నాయి. సినిమాలో నువ్వుంటే.. మరో కమర్షియల్ ఎలిమెంట్ ఎందుకు? శుభలేఖ, స్వయంకృషి, ఆరాధన, రుద్రవీణ, ఆపద్బాంధవుడు ఎన్ని ప్రయోగాలు చేయలేదు! ఇప్పుడెందుకు చేయవు?? సినిమా పోతుందేమో.. పోనీ!! నువ్వు ఎప్పటిలాగే గెలుస్తావ్.. ఆ సినిమా ఎప్పటిలాగే గెలుస్తుంది!! మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్. పైగా ఇప్పుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి!!’
– కణ్వస