‘క్షణం’ ‘కృష్ణ అండ్ లీల’ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు రవికాంత్ పేరేపు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘బబుల్గమ్’. రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రవికాంత్ పేరేపు శనివారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘కాలేజీ పూర్తయిన తర్వాతే మనం నిజమైన ప్రపంచంలోకి అడుగుపెడతాం. అప్పటి వరకు కుటుంబం అన్ని విషయాల్లో ఓ రక్షణలా ఉంటుంది. బయటకు వెళ్లినప్పుడు అంతా కొత్తగా అనిపిస్తుంది.
కెరీర్ మీద ఓ రకమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలాంటి క్రమంలో అనుకోకుండా ప్రేమలో పడితే జీవితం ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా కథాంశం. ‘లవ్ అండ్ రిలేషన్షిప్ బబుల్గమ్లాంటిది. మొదట్లో తియ్యగా ఉంటుంది. ఆ తర్వాత అంటుకుపోయి అస్సలే వదిలిపోదు’ అంటూ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. దానిని జస్టిఫై చేసేలా టైటిల్ పెట్టాం. కొత్తవాడైనా రోషన్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. నేటి యువతకు కనెక్టయ్యే చాలా అంశాలు ఈ సినిమాలో ఉంటాయి’ అన్నారు.