‘టైటిల్ చూసి ఇదొక బోల్డ్ కంటెంట్ సినిమా అనుకుంటారు కానీ.. క్లీన్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కించారు. చక్కటి వినోదంతో పాటు భావోద్వేగాలతో సాగుతుంది’ అని చెప్పింది మాళవిక సతీషన్. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’. సంతోష్ కంభంపాటి దర్శకుడు. ఈ నెల 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా మాళవిక సతీషన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో దివ్య అనే పాత్రలో కనిపిస్తా. నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండే పాత్ర ఇది. సరదాగా జీవితాన్ని గడుపుతుంటాను. సాధారణంగా ప్రేమకథలో అమ్మాయి వెనక అబ్బాయి తిరుగుతాడు. కానీ ఈ కథలో అమ్మాయే అబ్బాయి వెనక పడుతుంటుంది. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే ఎమోషన్ ఉంటుంది. ఈ మధ్యే నా చదువు పూర్తయింది. అందుకే సినిమాల విషయంలో సెలెక్టివ్‌గా ఉంటున్నా. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. తెలుగు చిత్రసీమలో నా ప్రయాణం హాయిగా సాగిపోతున్నది. డిఫెన్స్ ఆఫీసర్ పాత్రతో పాటు స్పోర్ట్ కథాంశాల్లో నటించాలనుంది. హీరోల్లో నాగశౌర్య, అఖిల్‌ను అభిమానిస్తాను’ అని చెప్పింది.