తల్లిగా మారిన తర్వాత జీవితం ఓ కలలా సాగుతున్నదని అంటున్నది బాలీవుడ్ స్టార్ సోనమ్ కపూర్. తన పిల్లలతో గడుపుతున్న మధుర క్షణాలను ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. రెండోసారి మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్.. తన పిల్లల ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ చిత్రాలు అభిమానులతోపాటు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఊయలలో నిద్రపోతున్న తన తమ్ముణ్ని.. సోనమ్ పెద్ద కొడుకు వాయు ఎంతో ఎగ్జయిటింగ్‌గా చూస్తున్న ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఫొటోలతోపాటు.. తన మాతృత్వపు అనుభూతులు, అనుభవాల గురించీ పంచుకున్నది సోనమ్. ‘జీవితం ఒక కలలా ఉంది.
ఈ నెల ఎంతో అద్భుతంగా గడిచింది. థ్యాంక్యూ యూనివర్స్’ అంటూ రాసుకొచ్చింది. పిల్లల గోప్యతను గౌరవిస్తూ.. వారి ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడింది. ఈ పోస్టుకు అభిమానులతోపాటు తోటి నటీనటులు కూడా కామెంట్లు పెడుతున్నారు. సోనమ్ భర్త ఆనంద్ స్పందిస్తూ.. ‘నేను ఈ పోస్ట్‌ను ఒక్కసారి కంటే ఎక్కువసార్లు లైక్ చేయడం ఎలా?’ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఆమె సోదరి రియా కపూర్.. హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను చూపించింది.
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సోనమ్ కపూర్. మొదట్లో దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసింది. 2007లో భన్సాలీ దర్శకత్వంలోనే వచ్చిన సావరియా చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది.