ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా సమాధానం చెప్పడంలో బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ముందుంటుంది. సినిమాలతోపాటు తన వ్యక్తిగత జీవితం గురించీ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా, ‘66 ఏళ్ల వయసులో నీనా గుప్తా ప్రెగ్నెంట్ అయిందా?’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వింత పుకారు తెగ షికారు చేసింది. ఈ ఘటనపై తనదైన శైలిలో స్పందించి.. అందరి నోర్లూ మూయించింది నీనా. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరైంది నీనా గుప్తా.
ఇందుకు సంబంధించిన ఓ ఫొటోలో.. నీనా పొట్ట కాస్త ముందుకు వచ్చినట్లుగా ఉంది. దాంతో కొందరు నెటిజన్లు.. ‘నీనా ప్రెగ్నెంట్ ఏమో?!’ అంటూ సోషల్ మీడియాలో చర్చకు దారితీశారు. ఈ పుకార్లపై నీనా స్పందిస్తూ.. తన పాత సినిమా ‘బధాయి హో’తో పోల్చింది.
ఆ సినిమాలో మధ్య వయసు గర్భిణిగా కనిపిస్తుంది నీనా. దాంతో నీనా.. ‘నాకిప్పుడు కావాల్సింది ఇదే! నిజ జీవితంలో ‘బధాయి హో’ అన్నమాట’ అంటూ ఫన్నీగా రిప్లయి ఇచ్చింది. ఇక ఫొటోల్లో తన పొట్టభాగం ఎత్తుగా కనిపించడానికి గల కారణాన్నీ వెల్లడించింది. ఆరోజు తాను కట్టుకున్న చీర మెటీరియల్ చాలా మందంగా ఉండటం వల్లే.. కాస్త లావుగా కనిపించినట్లు చెప్పింది.
“అక్కడ ఎలాంటి బధాయి హో లేదు. నేను ప్రెగ్నెంట్ కాదు. అయినా, ఈ వయసులో నా ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతున్నది. దీన్ని చూస్తుంటే.. ఒక దేశంగా మనం ఎంతలా పరిణతి చెందుతున్నామో అర్థమవుతున్నది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఆమె తాజా ప్రాజెక్ట్.. నెట్ఫ్లిక్ డ్రామా సిరీస్ ‘చుంబక్’. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.