పన్ను చెల్లింపులో నిజాయితీ చాటుకున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది అత్యధిక పన్ను చెల్లించిన నటుల్లో ఒకరిగా నిలిచారు. ఈ మేరకు ఆదాయపన్నుశాఖ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేసింది. ఈ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
అక్షయ్ కుమార్ అభిమానులు తమ హీరో అత్యధిక టాక్స్ పేయర్ మాత్రమే కాదని సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారని ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు గత ఐదేళ్లుగా అత్యధిక పన్ను చెలిస్తున్న సెలబ్రిటీగా అక్షయ్ కొనసాగుతున్నారు. ఆయన ఏడాదికి దాదాపు 35 కోట్ల రూపాయల టాక్స్ కడతారని సమాచారం. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల దాకా ఆయన పారితోషికం తీసుకుంటారు.
ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాలతో పాటు వాణిజ్య ప్రకటనలు ఈ స్టార్ హీరోకు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. ఇటీవల ఆయన ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.