Bollywood | బాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో మరో స్టార్ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు బీ-టౌన్లో హాట్ టాపిక్‌గా మారాయి. నటి ఆకాంక్ష రంజన్ కపూర్, దర్శకుడు శరణ్ శర్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఏడాది జూలైలోనే వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఆకాంక్ష – శరణ్ జంట గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచినా, ఇటీవల జరిగిన పలు సినీ వేడుకల్లో కలిసి కనిపించడంతో వారి రిలేషన్‌షిప్‌పై క్లారిటీ వచ్చింది. ఇప్పుడు పెళ్లి వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఆకాంక్ష రంజన్ కపూర్‌కు ఆలియా భట్‌తో ఉన్న సన్నిహిత సంబంధం గురించి తెలిసే ఉంటుంది. ఆలియా పెళ్లి వేడుకల్లో ఆకాంక్ష సందడి చేయడం మనం చూశాం. దీంతో ఇప్పుడు ఆకాంక్ష పెళ్లిలో రణబీర్ కపూర్ – ఆలియా భట్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశముందని టాక్.
వరుడు శరణ్ శర్మ విషయానికి వస్తే, బాలీవుడ్లో తనదైన గుర్తింపు సంపాదించిన దర్శకుడు. గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ మాహి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ఈ పెళ్లి వేడుకను ముంబైలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలైలో వర్షాకాలం ఉండటంతో ఇండోర్ వెడ్డింగ్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఆకాంక్ష తన వెడ్డింగ్ లెహంగా కోసం ప్రముఖ డిజైనర్లను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.