Bindu Madhavi | తెలుగు టెలివిజన్‌లో కామెడీ షోలంటే ముందుగా గుర్తుకొచ్చేది జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్ధస్త్. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షోలు అనేక మంది కమెడియన్స్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. చాలా మంది నటులు, యాంకర్లు, కమెడియన్స్ ఈ వేదిక ద్వారానే ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్డమ్ సంపాదించారు. అయితే ఈ షోలపై ప్రారంభం నుంచే కొన్ని విమర్శలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గారిటీ జోక్స్, ఫ్యామిలీతో కలిసి చూడలేని కొన్ని స్కిట్స్‌పై సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది.ఇప్పుడు ఇదే అంశంపై హీరోయిన్, బిగ్‌బాస్ ఫేమ్ బిందు మాధవి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆమె నేరుగా ఏ షో పేరు ప్రస్తావించకపోయినా, నెటిజన్లు మాత్రం ఆమె కామెంట్స్‌ను జబర్దస్త్ షోకు ఇండైరెక్ట్ కౌంటర్‌గా భావిస్తున్నారు. ప్రస్తుతం బిందు మాధవి కొత్తగా ప్రారంభమైన మాస్ జాతర అనే కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షో కూడా కామెడీ స్కిట్స్ ఆధారంగానే నడుస్తోంది. అయితే మిగతా షోలతో పోలిస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ క్లీన్ కామెడీ అందిస్తున్నామని షో టీమ్ చెబుతోంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బిందు మాధవి ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “మాస్ జాతర పూర్తిగా ఎంటర్టైన్మెంట్తో నిండిన షో. మొదట నన్ను జడ్జిగా చేయమని అడిగినప్పుడు నేను వెంటనే ఒప్పుకోలేదు. ఎందుకంటే కామెడీ స్కిట్స్ అంటే ఇప్పుడు ఎక్కువగా వల్గర్ లైన్స్, డబుల్ మీనింగ్ జోక్స్ వాడుతున్నారని అనిపించింది. అలాంటి షోల్ని చూస్తూనే ఉన్నాం. అందుకే మొదట వద్దనుకున్నాను” అని చెప్పింది.
అయితే తర్వాత షో డైరెక్టర్ ప్రత్యేకంగా వచ్చి తనకు హామీ ఇచ్చారని బిందు మాధవి తెలిపింది. “మా షోలో వల్గారిటీ ఉండదు. ఎక్కడైనా అలాంటి లైన్స్ ఉంటే మీరు షో మధ్యలోనే వెళ్లిపోవచ్చు అని చెప్పారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా షో రూపొందిస్తామని భరోసా ఇచ్చారు. అందుకే నేను అంగీకరించాను” అని వివరించింది. ఇప్పటికే 28 ఎపిసోడ్లు పూర్తయ్యాయని, ఇప్పటివరకు ఒక్కసారి కూడా అసౌకర్యంగా ఫీల్ కాలేదని బిందు మాధవి చెప్పింది. “తెలుగులో ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసేలా, వల్గారిటీ లేకుండా కామెడీ చేయగలమని మా షో నిరూపిస్తోంది. ఈ షోలో భాగమవ్వడం నాకు గర్వంగా ఉంది” అంటూ ఆమె వ్యాఖ్యానించింది. మొత్తానికి బిందు మాధవి చేసిన వ్యాఖ్యలు మరోసారి తెలుగు కామెడీ షోలలో వల్గారిటీ అంశాన్ని హాట్ టాపిక్‌గా మార్చేశాయి.