‘బైక్ అనేది ప్రతి ఒక్కరికి ఓ ఎమోషన్. ఈ సినిమాలో రేసింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీకొడుకుల అనుబంధం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు దర్శకుడు అభిలాష్ రెడ్డి. శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘బైకర్’ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు అభిలాష్ రెడ్డి సినిమా విశేషాలను పంచుకున్నారు.
రియల్ రేసర్స్‌తో రేసింగ్ సీక్వెన్స్ తీశాం. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్‌కే 60రోజుల సమయం పట్టింది. ఈ సినిమా రెండు టైమ్ లైన్స్‌లో జరుగుతుంది. 90స్లో టూ స్ట్రోక్ బైక్స్ ఉండేవి. ఇప్పుడవి రావడం లేదు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైం తీసుకుంది.
ఈ సినిమా కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నుంచి రేసర్స్ని రప్పించాము. ఇండోనేషియాలో రేసింగ్ సీక్వెన్స్ షూట్ చేశాం. రేసింగ్ స్పోర్ట్స్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. శ్యామ్ కొఠారి అనే వెటరన్ రేసర్ ఉన్నారు. కానీ ఆయనకు క్రికెట్లో కపిల్‌దేవ్‌కి వచ్చినంత గుర్తింపు రేసింగ్‌లో రాలేదు. రేసింగ్‌కు కూడా ఆ స్థాయి గుర్తింపు తీసుకురావాలన్నదే ఈ సినిమా అభిమతం. ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ రేసింగ్‌లో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకున్నాం.
ఇందులో రాజశేఖర్ ఫాదర్ కమ్ కోచ్ పాత్రలో కనిపిస్తారు. ఆయన చుట్టే కథ తిరుగుతుంది. శర్వానంద్ ఈ సినిమా కోసం 23 కిలోల బరువు తగ్గారు. ఆరు నెలల పాటు తీవ్రంగా శ్రమించి ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్ అయ్యారు. సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. తన కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని శర్వానంద్ చెప్పారు.
నాకు మిడిల్‌క్లాస్ ఎమోషన్స్ చాలా ఇష్టం. ఎలాంటి సినిమా చేసినా వాటిని మిస్ చేయను. ఈ సినిమా ట్రైలర్ బాగుందని ప్రభాస్ ప్రశంసించారు. దిల్‌రాజుకు కూడా బాగా నచ్చింది. నా తదుపరి చిత్రాన్ని ఆయనతోనే చేస్తున్నా.