MEGA 157 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవలే భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ సినిమాతో నిరాశలో మునిగిపోయిన అభిమానులకు కొత్త మూవీ అప్డేట్ అందించి జోష్ నింపతోంది చిరంజీవి టీం. తాజాగా MEGA 157కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. MEGA 157 షూటింగ్ నవంబర్‌లో షురూ కానుంది. తాజా టాక్ ప్రకారం రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్‌ను లాంఛ్ చేయబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్టందుకున్నాడు చిరంజీవి. అయితే భోళాశంకర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో కథల ఎంపికలో రూట్ మార్చే పనిలో ఉన్నాడట చిరంజీవి. చిరంజీవి మరోవైపు బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurusala) డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్‌లో కొనసాగుతున్నాయని ఇప్పటికే ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ బ్రో డాడీ (BRO Daddy)కి రీమేక్‌గా రాబోతుందని సమాచారం.
మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ పాత్రలను చిరంజీవి, శర్వానంద్ రీప్లేస్ చేయబోతున్నారని టాక్. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్లో ఈ సినిమా తెరకెక్కనుంది.