Bhakshak Movie | బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతుంది. అయితే ఈసారి థియేటర్లో కాదు నేరుగా ఓటీటీలో. భూమి ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘భక్షక్’ (Bhakshak). ఈ సినిమాకు పులకిత్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బాద్షా సొంత బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9 నుంచి ప్రీమియర్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. వసతి గృహాల్లో ఉండే అనాధ అమ్మాయిలు అత్యాచారానికి గురవుతుండగా.. ఈ మాఫియాను అక్కడున్న ఒక లోకల్ రౌడీ నడిపిస్తుంటాడు. అయితే ఈ మాఫియాను బయటపెట్టే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వైశాలి (భూమి) పాత్రలో ఇందులో కనిపించనుంది. ఇక బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను వైశాలి ఎలా గుర్తించింది? ఆధారాలతో సహా వాటిని ఎలా బయటపెట్టింది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పుల్కిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ, సాయి తమ్హంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.