కెరీర్లో బిల్లా అనే సినిమాతో మంచి హిట్ కొట్టిన మెహర్ రమేష్ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు. కంత్రి, శక్తి, షాడో వంటి డిజాస్టర్లతో అందరినీ భయపెట్టేశాడు. ఆయన సినిమాలు తీయక కూడా చాలా రోజులు అవుతుంది. అయితే చిరంజీవి అతనికి భోళా శంకర్ అనే ప్రాజెక్ట్‌ని అప్పగించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాగా రూపొందుతుంది.
అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం రాబోతోంది. రాఖీ స్పెషల్, చిరంజీవి బర్త్ డే సందర్భంగా భోళా శంకర్ టైటిల్ పోస్టర్, కీర్తి సురేష్, చిరంజీవి బంధాన్ని తెలియజేసే వీడియోను వదిలారు. ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న “భోళా శంకర్” చిత్రాన్ని నిన్న సాయంత్రం ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిరు తన పాత్ర కోసం ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేశారు.
చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ… “భోళా శంకర్” ముహూర్త వేడుక నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు జరుగుతుందని, నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.