‘భగవంత్ కేసరి’తో భారీ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయారు. ఎన్బీకే 109గా రాబోతున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్కేసరి చిత్రాల్లో పూర్తి గడ్డంతో కనిపించిన బాలయ్య, ఈ సినిమా కోసం క్లీన్ షేవ్ చేసుకొని నీట్గా తయారయ్యారు. బాబీ సినిమా కోసమే ఆయన అలా మారినట్టు సమాచారం. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం ఉన్న హీరోల్లో బాలయ్య చేసినన్ని ద్విపాత్రాభినయాలు ఏ హీరో చేయలేదన్నది యథార్థం. రీసెంట్గా చేస్తున్న బాబీ సినిమాలో కూడా ఆయన ఇద్దరుగా కనిపించబోతున్నారట. ఇందులోని ఓ పాత్ర మధ్య తరగతి ఫ్యామిలీమేన్ తరహా పాత్రయితే, మరో పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందని తెలుస్తున్నది. ఈ సినిమాను కూడా ఘన విజయం చేసి, బాలకృష్ణను డబుల్ హ్యాట్రిక్ వైపుకు నడిపించడానికి బాబీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు.