అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ఓ వ్యాపారవేత్తతో పెళ్లిపీటలెక్కబోతున్నదని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిని ఆమె వ్యక్తిగత టీమ్ ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించింది.
‘అనుష్క శెట్టి వయసుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వార్తల్ని ప్రచారం చేస్తున్నారు. మరి హీరోల వయసు విషయంలో మీలో ఆ ఉత్సాహం ఎందుకు కనిపించడం లేదు?’ అని ప్రశ్నించింది. ‘తన వ్యక్తిగత జీవితం విషయంలో అనుష్క గోప్యతను పాటిస్తుంది. పెళ్లి అనేది వ్యక్తిగత విషయం. అది బ్రేకింగ్ న్యూస్ ఎంత మాత్రం కాదు. వార్తల్ని ప్రచురించే ముందు నిజానిజాలేమిటో తెలుసుకోం డి’ అంటూ అనుష్క టీమ్ పేర్కొన్నది.