హీరో రాజ్‌తరుణ్ కమర్షియల్ సక్సెస్‌ను అందుకొని చాలా కాలమైంది. కుమారి 21ఎఫ్ తర్వాత చాలా సినిమాలు చేసినా అవేవి ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. విజయం కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న రాజ్‌తరుణ్ నటించిన తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ తర్వాత రాజ్‌తరుణ్, శ్రీను గవిరెడ్డి కలయికలో రూపొందిన చిత్రమిది. రాజ్‌తరుణ్ ఈ సినిమాతో తిరిగి విజయాల బాట పట్టాడా? దర్శకుడు శ్రీను గవిరెడ్డి ద్వితీయ విఘ్నం దాటాడా?లేదా అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే…
రాజు(రాజ్‌తరుణ్) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. సాటివారి ఇబ్బందులను గమనిస్తూ వారికి సాయం చేస్తుంటాడు. రాజు మంచితనాన్ని చూసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే శృతి(కశిష్‌ఖాన్) అతడిని ఇష్టపడుతుంది. రాజుకూడా తనలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంటాడని అనుకుంటుంది. కానీ అతడు సెక్యూరిటీ గార్డ్ అనే నిజం ఆమెకు తెలుస్తుంది. ఇంతలోనే రాజును చంపడానికి హంతకముఠా ప్రయత్నిస్తుంది. ఆ ప్రమాదం నుంచి రాజు బయటపడతాడు. ఈ క్రమంలో రాజు అసలు పేరు బంగార్రాజు అనే నిజం తెలుస్తుంది. భీమవరం సమీపంలోని ఓ పల్లెటూరిలో వారసత్వం వచ్చిన ఆస్తిపాస్తులను అనుభవిస్తూ జులాయిగా తిరుగుతుంటాడు. ఊరి ప్రెసిడెంట్‌గా గెలవాలని అనుకుంటాడు. కానీ తన ప్రమేయం లేకుండానే స్నేహితుడిని చంపిన నేరంలో జైలు పాలు అవుతాడు. బంగార్రాజు జైలు పాలు కావడానికి కారణమేమిటి?ఆ హత్య చేసిందెవరు?బంగార్రాజు ప్రేమను శృతి అర్థం చేసుకుందా?తాను పుట్టిన ఊరి గొప్పతనాన్ని, నిజంగా అనుభవించడం అంటే ఏమిటో బంగార్రాజు ఎలా అర్థం చేసుకున్నాడన్నదే మిగతా కథ.
అనుభవించు రాజా కథ కొత్తదేమీ కాదు. ఇదివరకు ఎన్నో సినిమాల్లో చూసిన కథనే విభిన్నంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కోటీశ్వరుడైన ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా హీరో ఓ సామాన్య జీవితాన్ని గడుపుతుండటం..అనుకోకుండా ఓ చిన్న మలుపు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో హంతకుడిగా తన మీద పడిన ముద్ర పడటం..దానిని చెరిపేసుకోవడానికి తెలివితేటలను ఉపయోగించి విలన్‌కు చెక్ పెట్టడం అనే పాయింట్ వినగానే ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. అనుభవించు రాజా అలాంటి టెంప్లేట్ సినిమానే. వినోదానికి పల్లెటూరి నేపథ్యాన్ని, మర్డర్ మిస్టరీ అంశాలను మేళవిస్తూ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఈ కథ రాసుకున్నారు. పుట్టిన ఊరిని ఎప్పటికీ మర్చిపోకూడదని, అనుభవించడం అంటే ఆస్తిపాస్తులను ఖర్చు చేయడం కాదు బంధాలను నిలుపుకోవడమే అనే సందేశాన్ని జోడిస్తూ సినిమాను తెరకెక్కించారు.
సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే హీరోను సౌమ్యుడిగా..మంచివాడిగా చూపించడం..తనకంటే అతడో పెద్ద ఉద్యోగి అని భ్రమపడి హీరో ప్రేమించేయడం లాంటి అంశాలతో పరిచయ ఘట్టాలను సరదాగానడిపించారు దర్శకుడు. ఈ కన్యూజన్ డ్రామాలో సుదర్శన్, రఘుబాబు లాంటి కమెడియన్స్‌ను వాడుకుంటూ వినోదాన్ని రాబట్టుకున్నారు.
హీరోపై విలన్ గ్యాంగ్ ఎటాక్ చేసే సన్నివేశంతో కథను గోదావరి జిల్లాలకు షిఫ్ట్ అవుతుంది. ఊళ్లో కోడిపందాలు ఆడుతూ, ఎన్నికల పేరుతో విచ్చలవిడిగా హీరో డబ్బులు ఖర్చు చేయడం లాంటి అంశాలతో ద్వితీయార్థం మొదలవుతుంది. తనను హత్యనేరంలో ఇరికించిన వ్యక్తిని హీరో తెలివిగా ఎలా ఊరి ప్రజలందరికి పట్టించాడనే ట్విస్ట్పైనే ద్వితీయార్థం ఆధారపడింది. ఆ మలుపును దర్శకుడు బాగానే రాసుకున్నారు. యాక్షన్ అంశాల జోలికి పోకుండా పతాక ఘట్టాలను భావోద్వేగంగా తీర్చిదిద్దారు.
గత కొంతకాలంగా కథల ఎంపికలో తడబడిపోతున్నాడు రాజ్‌తరుణ్. ప్రయోగాలు, సీరియస్ సినిమాలతో చేదు ఫలితాన్ని అందుకున్నాడు. వినోదమే తన బలం అని తెలుసుకొని అతడు చేసిన సినిమా ఇది.
సెక్యూరిటీ గార్డ్ రాజుగా, పల్లెటూరి బంగార్రాజు పాత్రలో హుషారుగా కనిపించాడు. తనదైన శైలి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించాడు. కశిష్‌ఖాన్ అందంగా కనిపించింది. కానీ నటించడానికి ఆమెకు ఎక్కువగా అవకాశం దొరకలేదు. పోసాని కృష్ణమురళి, సుదర్శన్‌తో పాటు జబర్ధస్థ్ కామెడీ గ్యాంగ్ సినిమా కామెడీ భారాన్ని మోశారు. వారిలో సుదర్శన్ మినహా మిగిలిన వారు నవ్వించలేకపోయారు. అజయ్ పాత్ర విభిన్నంగాఉంది. భూపాల్ మంచి క్యారెక్టర్ దక్కింది.
దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డికి ఇది రెండో సినిమా. తొలి సినిమా మిగిల్చిన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కథ, కథనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయోగాల జోలికి పోకుండా తెలిసిన కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. అదే సినిమాకు మైనస్‌గా మారింది. ప్రథమార్థంలో హీరో లవ్ ఎపిసోడ్‌తో పాటు ఫ్లాష్‌బ్యాక్‌లో స్పీడు తగ్గింది. కథలో వచ్చే మలుపులు కూడా ఊహాతీతంగానే సాగుతాయి. మెలోడీతో పాటు మాస్ సాంగ్స్ కూడా చేయగలననే ప్రయత్నంతో గోపీసుందర్ సంగీతాన్ని అందించారు. టైటిల్ సాంగ్ బాగుంది. చిన్న సినిమానే అయినా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందినది కావడంతో ఎక్కడ ఆ ఫీల్ కనిపించదు. కథను నమ్మి నిర్మాత సుప్రియ యార్లగడ్డ బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు.
టైమ్‌పాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. కొత్తదనం జోలికి పోకుండా ప్రేక్షకుల్ని రెండుగంటల పాటు నవ్విస్తే చాలానే లక్ష్యంతో దర్శకనిర్మాతలు ఈ సినిమాను రూపొందించారు. పెద్ద సినిమాలు పోటీగా లేకపోవడం ఓపెనింగ్స్ విషయంలో సినిమాకు కలిసిరావచ్చు.