Ansiba Hassan | మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 3’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి అన్సిబా హసన్ ఇప్పుడు ఓ వివాదంతో వార్తల్లో నిలిచారు. సినిమాలో మోహన్ లాల్ పెద్ద కుమార్తె అంజు పాత్రలో నటించిన అన్సిబా, ప్రస్తుతం తనపై జరిగినట్లు చెబుతున్న మతపరమైన వ్యాఖ్యలపై సంచలన ఆరోపణలు చేయడం మలయాళ సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా నటుడు టినీ టామ్ తనను ‘జిహాదీ’ అంటూ వ్యాఖ్యానించారని అన్సిబా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, వ్యక్తిగతంగా మరియు మానసికంగా ఇబ్బందులకు గురి చేశాయని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆరోపణలతో ఒక్కసారిగా మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చ మొదలైంది.
అన్సిబా గతంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) లో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాల వల్లే తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు అసలు కారణాలు వేరేనని ఆమె చెబుతున్నట్లు సమాచారం. తనపై సంస్థలో నిరంతర వేధింపులు జరిగాయని, కొన్ని సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ప్రయత్నించారని అన్సిబా ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారాలు జరిగాయని, ఒక సహనటుడి డ్రైవర్‌కు బలవంతపు మత మార్పిడి చేయించానంటూ ప్రచారం చేశారని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా ‘అమ్మ’ సంస్థలోని ఎగ్జిక్యూటివ్ కమిటీకి చెందిన వ్యక్తి ఒకరు తనపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఈ ఘటనల వల్ల తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని, ఆ సమయంలో సంస్థ నుంచి సరైన మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అన్సిబా చేసిన ఆరోపణలపై నటుడు టినీ టామ్ స్పందించారు. గతంలో ఆమె ఎప్పుడూ ఇలాంటి విషయాలను ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. రాజీనామా చేసిన సమయంలో కూడా వృత్తిపరమైన కారణాలనే ఆమె పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం మలయాళ చిత్ర పరిశ్రమలో మతపరమైన వివక్ష, అంతర్గత విభేదాలపై పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక స్థాయిలో మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. పరిశ్రమలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.