Anshula Kapoor | బాలీవుడ్లో మరో స్టార్ వెడ్డింగ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆయన పెద్ద కుమార్తె అన్షులా కపూర్ వివాహ వేడుకలు ముంబైలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ రోహన్ థక్కర్‌తో అన్షులా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుండగా, ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య సందడిగా సాగుతున్నాయి.గత ఏడాది న్యూయార్క్‌లో సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న అన్షులా-రోహన్ జంట ఇప్పుడు జూలై 6న పెళ్లి పీటలెక్కబోతోంది. దీంతో కపూర్ కుటుంబంలో ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది.
ఈ వివాహ వేడుకల తొలి కార్యక్రమంగా ముంబైలో సంప్రదాయబద్ధంగా ‘మాతా కీ చౌకీ’ పూజను నిర్వహించారు. వరుడు రోహన్ థక్కర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అన్షులా సోషల్ మీడియాలో పంచుకుంటూ, “ప్రేమ, కుటుంబం, దేవుని ఆశీస్సులతో మా కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది” అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది.అన్షులా పెళ్లి వేడుకల్లో అన్నయ్య అర్జున్ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తల్లి మోనా శౌరీ కపూర్ మరణం తర్వాత అన్షులాకు అర్జున్ కపూరే అండగా నిలిచారు. చెల్లెలి బాధ్యతలను తన భుజాలపై వేసుకుని కుటుంబానికి పెద్దగా వ్యవహరించిన అర్జున్, ఇప్పుడు ఆమె పెళ్లి ఏర్పాట్లను కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఒకప్పుడు బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి కుమార్తెలైన జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లతో అర్జున్, అన్షులాల మధ్య పెద్దగా అనుబంధం లేదనే వార్తలు వినిపించేవి. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఈ నలుగురు తోబుట్టువులు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు అన్షులా పెళ్లి వేడుకల్లో ఆ అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది.జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లు పెళ్లి ఏర్పాట్లలో చురుకుగా పాల్గొంటూ అక్కకు అండగా నిలుస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేస్తూ, డాన్స్‌లు చేస్తూ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా మారారు. సోనమ్ కపూర్, రియా కపూర్లతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డిన్నర్ వేడుకకు సంజయ్ కపూర్, మహీప్ కపూర్‌తో పాటు కపూర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు.తెలుగు ప్రేక్షకులకు ‘పెద్ది’ సినిమా ద్వారా మరింత దగ్గరైన జాన్వీ కపూర్ కూడా తన అక్క పెళ్లి వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అభిమానులను ఆకట్టుకుంటోంది.