యువ నటుడు అనిష్, అనస్వర రాజన్ జంటగా.. మహేష్ ఉప్పల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇట్లు అర్జున’. డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్‌తో వచ్చిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తించిందని మేకర్స్ చెబుతున్నారు. హీరో అనిష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రత్యేక పోస్టర్ని, వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్లో అనిష్ కూల్‌గా చార్మింగ్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈ వీడియో.. ఇందులోని హీరో పాత్రను పరిచయం చేయడమే కాక, ఆ పాత్రలోకి వెళ్లడానికి అనిష్ చూపించిన చొరవను కూడా ఆవిష్కరించింది. ఇందులో హీరో మూగవాడని, కేవలం మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ డెప్త్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాల్సిన పాత్ర ఇదని, కొత్త నటుడైన అనిష్ ఈ పాత్రను ఓ సవాలుగా తీసుకొని, తన నటనా పరిధిని విస్తరించుకుంటూ ఈ పాత్ర పోషించారని మేకర్స్ తెలిపారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజా మహదేవన్, నిర్మాణం: వాట్ నెక్ట్స్ ఎంటైర్టెన్మెంట్స్.