Anil Ravipudi | టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్స్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆయన, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే కథలతో దాదాపు 100 శాతం విజయాల రికార్డును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో ఆయన సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి వరుస విజయాల తర్వాత అనిల్ రావిపూడి ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్‌తో ‘F2’, ‘F3’ వంటి విజయవంతమైన చిత్రాలు అందించిన అనిల్, కళ్యాణ్ రామ్‌తో తన తొలి చిత్రం ‘పటాస్’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలను ఒకే సినిమాలో చూపించబోతుండటంతో ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయని సమాచారం. పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌కు సంబంధించి ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పండుగ వాతావరణం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అనిల్ రావిపూడి స్టైల్ కామెడీకి సరిపోయేలా ఈ చిత్రానికి ‘సంక్రాంతి సరుకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘సింగ్ గీతం’ గోల్డెన్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్లో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్‌గా మారాయి. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, నిర్మాత నాగ్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు. సాధారణంగా మేము ట్రైలర్లు, ప్రమోషన్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి చాలా కష్టపడతాం. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ట్రైలర్ లేకుండానే సినిమాను విడుదల చేసి విజయం సాధించారు. ఆ ఫార్ములా నాకు బాగా నచ్చింది. ఇకపై నా సినిమాలకు కూడా ట్రైలర్లు కట్ చేయను అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.