Anee Master | కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉన్న టైమ్‌లో ఆనీ మాస్టర్ సినిమాలను ఎందుకు వదిలేసింది? మళ్లీ ఢీ షోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది?
Anee Master | కాలర్ ఎగరేస్తూ ఆ అమ్మాయి చిరంజీవి స్టెప్పులేస్తుంటే.. జనం ఊగిపోయేవారు. కేకలేసేవారు. బ్లాక్ అండ్ వైట్ టీవీలో చిత్రలహరి చూస్తూ చిత్రపరిశ్రమలో కొరియో గ్రాఫర్‌గా పేరు తెచ్చుకోవాలని తెగ కలలుగనేది. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకుని ‘శంకర్‌దాదా ఎంబీ బీఎస్' సినిమా కోసం మెగాస్టార్ చిరుతోనూ స్టెప్పులేయించింది అనీ మాస్టర్ అలియాస్ అనితా లామా.
Anee Master | కాలర్ ఎగరేస్తూ ఆ అమ్మాయి చిరంజీవి స్టెప్పులేస్తుంటే.. జనం ఊగిపోయేవారు. కేకలేసేవారు. బ్లాక్ అండ్ వైట్ టీవీలో చిత్రలహరి చూస్తూ చిత్రపరిశ్రమలో కొరియో గ్రాఫర్‌గా పేరు తెచ్చుకోవాలని తెగ కలలుగనేది. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకుని ‘శంకర్‌దాదా ఎంబీ బీఎస్’ సినిమా కోసం మెగాస్టార్ చిరుతోనూ స్టెప్పులేయించింది అనీ మాస్టర్ అలియాస్ అనితా లామా. ఆ డార్జిలింగ్ డాల్ సినిమా ప్రయాణమంతా ఆమె మాటల్లోనే..
నాన్న బీర్ బహదూర్ లామా ఆర్మీలో సిపాయి. ఉద్యోగంలో భాగంగా డార్జిలింగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నా ఎనిమిది నెలల వయసులో నాన్న రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఫార్మా కంపెనీలో చేరారు. కొంతకాలానికి క్యాన్సర్ బారినపడి చనిపోయారు. అప్పటికి నాకు ఆరేండ్లు. సైనిక్‌పురి ఆర్మీ స్కూల్లో చదువుతున్నా. అంతటి ఒంటరితనంలో కూడా.. మేమంతా హైదరాబాద్ వాతావరణానికి అలవాటైపోయామనే ఒకే ఒక్క కారణంతో వెనక్కి వెళ్లడానికి ఇష్టపడలేదు అమ్మ. కొంతకాలానికి, తనకూ అదే కంపెనీలో ఉద్యోగం దొరికింది.
‘చిరు’ పాటలు
ఊహ తెలిసినప్పటి నుంచీ డ్యాన్స్ చేస్తున్నాను. చిరంజీవి, మాధురీ దీక్షిత్ నా అభిమాన నటులు. దూరదర్శన్‌లో ‘చిత్రలహరి’ వస్తుంటే మా ఓనర్స్ ఇంటి బయట నిలబడి చూసేదాన్ని. ఆ పాటల్లో స్టెప్పులు గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇరుగుపొరుగు మెచ్చుకుని, గణేశ్ మండపాల దగ్గర డ్యాన్స్ వేయించేవాళ్లు. ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ సాంగ్, ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’లోని ‘అబ్బనీ తీయనీ దెబ్బ’ పాటకు రెస్పాన్స్ మామూలుగా ఉండేది కాదు. ఆ స్పందన చూసే స్టేజ్ షోలకు పిలిచేవారు. పారితోషికమూ ఇచ్చేవారు.

డ్యాన్స్ బేబీ డ్యాన్స్
పద్నాలుగేండ్లప్పుడు.. ఫ్రెషర్స్ పార్టీ కోసం బద్రుకా కాలేజ్ స్టూడెంట్స్‌కు డ్యాన్స్ నేర్పించాను. వాళ్లకు బాగా నచ్చింది. పదిహేను వందలు ఇచ్చారు. ఇదే నా ఫస్ట్ కొరియోగ్రఫీ ప్రాజెక్ట్. మార్వాడీ, సింధీ కుటుంబాలకు డ్యాన్స్ పాఠాలు చెప్పాను. ఆ డబ్బుతో కథక్ నేర్చుకున్నాను. అప్పట్లో నాకు స్కూటీ కూడా లేదు. ప్రీతి అనే స్టూడెంట్ బండి మీద తిరుమలగిరి నుంచి ఖైరతాబాద్ వెళ్లేదాన్ని. ఆ ప్రయాణం కష్టంగా అనిపించి ఏడాదిన్నర తర్వాత మానుకోవాలనుకున్నాను. ‘నీకు డ్యాన్స్ బాగా వస్తుంది. ఫ్రీగా నేర్పిస్తాను. మానొద్దు’ అని సర్దిచెప్పారు మా నాట్యగురువు మంగళా మేడమ్. ఆ సమయంలో జెమినీ టీవీలో ‘డ్యాన్స్ బేబీ డ్యాన్స్’ రియాలిటీ షో మొదలైంది. మొదటి సీజన్, మెగా ఫైనల్ విన్నర్ నేనే.
వర్షం సాక్షిగా..
ఒక రోజు నిక్సన్ మాస్టర్ పిలిపించారు. ‘వర్షం’ సినిమా 50 రోజుల ఫంక్షన్లో నవీన్ చంద్రతో కలిసి లీడ్ డ్యాన్సర్‌గా స్టేజ్ షో చేసే అవకాశం ఇచ్చారు. తర్వాత సత్య, నటరాజ్ మాస్టర్ టీమ్‌లో కార్పొరేట్ ఈవెంట్స్, మూవీ ఫంక్షన్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాను. వర్షం సినిమా సక్సెస్ మీట్ స్టేజ్ షో నాకు మంచి పేరు తెచ్చింది. ఓ రోజు.. హరీశ్ మాస్టర్ దగ్గర కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ప్రకాశ్ ఫోన్ చేశాడు. “శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేయమని అడిగాడు. ముందు ఆ మాట నమ్మలేక పోయాను. ‘కావాలంటే ఓ సారి హరీశ్ మాస్టర్‌కి కాల్ చెయ్. ఈ రోజు సాయంత్రం చిరంజీవిగారి ఇంట్లో డ్యాన్స్ ప్రాక్టీస్‌కి వచ్చెయ్’ అన్నాడు. నేను ఎవరి స్టెప్పులు చూసి డ్యాన్స్ నేర్చుకున్నానో సాక్షాత్తు ఆ మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేస్తున్నప్పుడు చెప్పలేని ఆనందం! ఆ భావోద్వేగాన్ని ఆపుకొని ప్రాక్టీస్ చేశాను. ‘నా పేరే కాంచనమాల’ పాటకు నా డ్యాన్స్ పాపులర్ అయింది. ఆ సినిమా హిట్ అయింది. నేనూ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాను. ఆ తర్వాత గుడుంబా శంకర్, బాలు, రచ్చ.. ఇంకా చాలా సినిమాలు చేశాను. మధ్యలో మోకాళ్ల నొప్పులు వచ్చాయి. షూటింగ్స్ కోసం 24 గంటలూ పని చేయడం అసాధ్యమని అర్థమైపోయింది. కాళ్ల నొప్పుల కారణంగా సినిమాలు మానేసి, లారెన్స్ మాస్టర్‌తో కలిసి స్టేజ్ షోలు చేశాను.
జీరో నుంచి మొదలై..
సినిమాలకు దూరమైనప్పుడే నాకు పెండ్లయింది. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాను. ఒక రోజు టీవీ చూస్తుంటే.. నాతో డ్యాన్స్ చేసిన వాళ్లు ‘ఢీ’షోలో జడ్జీలుగా కూర్చున్నారు. వీళ్లంతా ఆ స్థాయిలో ఉంటే.. నేను వంట చేయడం, అంట్ల్లు తోమడం ఏంటని బాధ పడ్డాను. మళ్లీ కెరీర్ నిర్మించుకోవాలి అని పించింది. అప్పుడు నాకు రెండేండ్ల బాబు ఉన్నాడు. ఇంట్లో చెబితే.. ఇప్పుడు ఎవరు అవకాశాలిస్తారని నిరాశపరిచారు. మా ఆయన ప్రమోద్ కుమార్ మాత్రం చాలా ప్రోత్సహించారు. జీరో లెవెల్ నుంచి మళ్లీ కెరీర్ మొదలు పెట్టాను. మాస్టర్స్‌కు కాల్ చేసి.. అసిస్టెంట్‌గా పనిచేస్తానని అడిగాను. ఎవరూ అవకాశం ఇవ్వలేదు. చాలాకాలం తర్వాత జానీ మాస్టర్ నుంచి పిలుపు వచ్చింది. ‘రచ్చ’ సినిమా కోసం ‘డిల్లకు.. డిల్లకు’ పాటకు పని చేయాలి రమ్మన్నారు. ఆ పాటతో జానీ మాస్టర్‌కు బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. నేను బాగా పని చేస్తానని ఇండస్ట్రీలో తెలిసి
పోయింది. రఘు, శేఖర్, నిక్సన్, గణేశ్, సీకే.. 20 మంది దాకా మాస్టర్లకు అసిస్టెంట్‌గా చేశాను. ఫుల్ బిజీ అయిపోయాను. అమ్మ, అత్తమ్మ నా కొడుకును చూసుకున్నారు. కొరియోగ్రాఫర్ కావాలనే నా కలను నిజం చేసిన సినిమా.. ‘జ్యోతిలక్ష్మి’. పూరీ సార్ ఇచ్చిన ఆ అవకాశం చిన్నది కాదు. ‘పైసా వసూల్’ సినిమాలో బాలకృష్ణ ఇంట్రడక్షన్ సాంగ్‌ను కూడా పూరీ సార్ నాకే ఇచ్చారు. ఆయన లేకపోతే ఈ ‘అనీ మాస్టర్’ ఇంత పాపులర్ కాకపోయేది. మహిళలకు నా సలహా ఒకటే.. సినీ పరిశ్రమ అంటే అమ్మాయిలు భయపడతారు. జంకు అవసరం లేదు. ప్రపంచంలో ఏదీ సులభంగా మన దగ్గరికి రాదు. ధైర్యంగా అడుగేయండి. నా విజయమే మీకు ఉదాహరణ.
…? నాగవర్ధన్ రాయల
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

