హైదరాబాద్ బస్తీ నేపథ్యంలోని సగటు యువత జీవితాలను, వారి కష్టనష్టాలను ఎటువంటి కృత్రిమ హంగులు లేకుండా అత్యంత సహజంగా తెరకెక్కించిన చిత్రం ‘అమీర్ లోగ్’. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ద్వారా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పూర్తిగా కొత్తవారితో, బలమైన కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇక్కడ చూద్దాం.
కథ
హైదరాబాద్‌లోని ఒక సాధారణ బస్తీకి చెందిన శ్రీను (MC హరి), ఫరూక్ (మనోజ్), మల్లేష్ (శశిధర్) ఎలాంటి లక్ష్యాలు లేకుండా తిరిగే ముగ్గురు ప్రాణ స్నేహితులు. బాధ్యతలేకుండా తిరిగే వీళ్ల కారణంగా కుటుంబ సభ్యులు నిత్యం సతమతమవుతుంటారు. ఇదే బస్తీలో ఉండే గీత (వేద జలంధర్) వీరిని తన తమ్ముల్లుగా భావించి మంచి మార్గంలో నడవమని సలహా ఇస్తుంది. ఆమె మాటలతో మారుతున్న శ్రీను, తన ఆఫీస్ పనుల్లో నిమగ్నమవుతాడు. ఈ క్రమంలోనే ఆఫీస్ ఉద్యోగులతో జరిగిన ఒక సరదా పందెం, బస్తీలో ఎవరికీ లొంగని చాచా (విశ్వేందర్ రెడ్డి) సహాయంతో వారు తయారు చేసే బిర్యానీ ఈ ముగ్గురి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. గీత లవర్ రవి (రావణ్ నిట్టూరు) ప్రోత్సాహంతో వీరు బిర్యానీ బిజినెస్ పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత వీరికి ఎదురైన ఊహించని అడ్డంకులు ఏమిటి? బాధ్యతలేని ఈ కుర్రాళ్ళు తమ లక్ష్యాన్ని ఎలా సాధించారు? అనేదే ఈ చిత్ర అసలు కథ.
నటీనటులు
ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా కొత్తవారైనప్పటికీ, ఎక్కడా నటిస్తున్నట్లు అనిపించకుండా తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయారు. ప్రధాన పాత్రధారులు హరి, మనోజ్, శశి తమ సహజమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. చాచా పాత్రలో విశ్వేందర్ రెడ్డి నటన సినిమాకు ఒక పెద్ద బలంగా నిలిచింది. గీతక్క పాత్రలో వేద జలంధర్ చక్కని అభినయాన్ని ప్రదర్శించగా, మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు & విశ్లేషణ:
దర్శకుడు రమణా రెడ్డి సోమ ఎంచుకున్న కథాంశం చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, దానిని నడిపించిన విధానం అభినందనీయం. పెద్ద పెద్ద ట్విస్టులు లేకపోయినా, ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో ఆయన సఫలమయ్యారు. స్మరణ్ అందించిన సంగీతం మరియు నేపథ్య సంగీతం సినిమాలోని భావోద్వేగాలను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. కెమెరామెన్ ఎస్వీకే పనితనం బస్తీ వాతావరణాన్ని, హైదరాబాద్ గల్లీలను కళ్ళకు కట్టినట్లు చూపించింది. రోహిత్ ఎడిటింగ్ షార్ప్‌గా సాగిపోయింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఎంతో క్వాలిటీగా ఉన్నాయి.
ముగింపు:
ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. మన ఇళ్ల చుట్టూ, మన గల్లీల్లో కనువిందు చేసే నిజ జీవిత పాత్రల ప్రతిబింబం. ఎలాంటి హంగులు లేకుండా స్వచ్ఛమైన భావోద్వేగాలను, చక్కటి సందేశాన్ని కోరుకునే ప్రేక్షకులకు ‘అమీర్ లోగ్’ ఒక మంచి దృశ్యకావ్యం.
రేటింగ్: 3