Allu Arjun | తెలుగు సినీ పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న అభిమాన వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా మాత్రమే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన అభిమానులు తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. తమ అభిమాన హీరో చూపే సేవా దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకుంటూ అనేక సందర్భాల్లో సమాజానికి అండగా నిలుస్తూ వస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తాజాగా తమ పెద్ద మనసును చాటుకుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరంపూరి సతీష్ కుమార్తె నక్షిత పుట్టుకతోనే అరుదైన జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. చిన్నారి అనోరెక్టల్ మాల్ఫార్మేషన్ అనే తీవ్ర ఆరోగ్య సమస్యతో పోరాడుతోంది.
ఇప్పటికే ఆమెకు రెండు క్లిష్టమైన శస్త్రచికిత్సలు జరిగాయి. అయితే పూర్తిగా కోలుకోవాలంటే మూడో ఆపరేషన్ కూడా అత్యవసరంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.మధ్యతరగతి కుటుంబానికి చెందిన సతీష్ కుటుంబానికి వరుస వైద్య ఖర్చులు భారంగా మారాయి. చిన్నారి చికిత్సకు అవసరమైన ఖర్చులు సమకూర్చుకోవడం కష్టంగా మారిన సమయంలో ఈ విషయం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కేంద్ర కార్యాలయం దృష్టికి వెళ్లింది. సంఘంలో కీలక సభ్యుడిగా ఉన్న సతీష్ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిసిన వెంటనే అసోసియేషన్ సభ్యులు స్పందించారు. చిన్నారి నక్షిత వైద్య ఖర్చుల కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని నిర్మాత బన్నీ ఫ్యాన్స్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, “మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కేవలం అభిమాన సంఘం మాత్రమే కాదు, ఒక కుటుంబం. మా కుటుంబ సభ్యులకు ఎలాంటి కష్టాలు వచ్చినా వారిని ఒంటరిగా వదిలిపెట్టం. అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడానికి ఎప్పుడూ ముందుంటాం” అని తెలిపారు. కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన అభిమాన సంఘ సభ్యుల సహాయానికి కరంపూరి సతీష్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. తోటి సభ్యుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ అభిమానులు చూపిన ఈ మానవతా దృక్పథాన్ని సినీ వర్గాలతో పాటు ప్రజలు కూడా అభినందిస్తున్నారు.