Dhootha Trailer | సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీ ఉంది. అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. ఇక్కడ సినిమాలు చేసే వాళ్లు వెబ్ సిరీస్‌లు చేయరు.. వెబ్ సిరీస్ చేసే వాళ్లు సినిమాలు చేయరు.. ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోల గురించి మాత్రమే. చిన్న హీరోలు ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేయడం.. అక్కడ బిజీ అవ్వడం కూడా జరుగుతుంది. నిజానికి వాళ్లకు డిజిటల్ వచ్చిన తర్వాత అవకాశాలు కూడా పెరిగాయి. సినిమాల్లో అవకాశాలు రాని చాలామంది చిన్న చిన్న హీరోలు వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తున్నారు. నవీన్ చంద్ర రాజ్ తరుణ్ లాంటి హీరోలు అయితే అక్కడ చాలా బిజీ అయిపోయారు.
డిజిటల్ లో వాళ్లకు చాలా డిమాండ్ కూడా ఉంది. ఇక శ్రీకాంత్, జగపతిబాబు లాంటి సీనియర్స్ కూడా వెబ్ సిరీస్‌ల్లో చేస్తున్నారు. కానీ స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు మాత్రం ఇప్పటివరకు డిజిటల్ వైపు చూడలేదు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని ఇలా చాలా మంది హోస్టులుగా మారారు.. కానీ సిరీస్ అయితే చేయలేదు. అయితే ఇప్పుడు నాగచైతన్య వాళ్ళందరికీ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మొదటిసారి ఒక వెబ్ సిరీస్ చేసిన హీరోగా చైతూ చరిత్రలో నిలిచాడు. ఈయన నటిస్తున్న దూత డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా నవంబర్ 23న చైతూ పుట్టినరోజు సందర్భంగా దూత ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు.
మనం ఇలాంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన విక్రమ్ కే కుమార్ దీనికి దర్శకుడు. సినిమాల పరంగా వరుసగా నిరాశ పరుస్తున్న విక్రమ్.. దూత వెబ్ సిరీస్ తో కచ్చితంగా ఆకట్టుకుంటాడని నమ్ముతున్నారు అక్కినేని అభిమానులు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే జర్నలిజం నేపథ్యంలో ఈ దూత సిరీస్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక జర్నలిస్టుగా నటించాడు నాగచైతన్య. అనుకోకుండా మర్డర్ కేసులో ఆయన ఇరుక్కోవడం.. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు.. ఈ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో దూత వెబ్ సిరీస్ తెరకెక్కింది. చూస్తుంటే కచ్చితంగా ఈ సిరీస్ తో చైతూ డిజిటల్లో కూడా తనదైన మార్క్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు.
ఒకవేళ ఈ సిరీస్ గాని బాగా హిట్ అయి చైతన్యకు మంచి పేరు వచ్చింది అంటే.. మిగిలిన హీరోలు కూడా వెబ్ సిరీస్ ల వైపు చూసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త ఒరవడికి చైతూ తెర తీసినట్టే. ఎందుకంటే ఇప్పటికే హిందీలో అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లు చేశారు. తెలుగులో కూడా ఈ ట్రెండ్ మొదలవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్లను ఎప్పుడు సినిమాల్లో మాత్రమే చూడకుండా అప్పుడప్పుడు ఇలా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా చూడడం వాళ్లకు ఆనందాన్ని కలిగించే విషయం. రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుంది కాబట్టి హీరోలు ఇటువైపు చూసే అవకాశం లేకపోలేదు. చూడాలిక ఏం జరగబోతుందో.