టాలీవుడ్ జూనియర్ పవర్ స్టార్ గా అకీరానందన్ కి పేరుంది. తెలుగు తెరకు ఇంకా పరిచయం కాకపోయినా పవర్ స్టార్ కొడుకుగా స్టార్ డమ్ ని అందుకున్నాడు అకీరా. ఈ కాబోయే హీరో బర్త్ డే రోజున ఓ గొప్ప విషయాన్ని పంచుకున్నది రేణుదేశాయ్. అంతేకాదు పంచెకట్టులో ఉన్న నిన్ను చూసి గర్వంగా ఉందంటూ పోస్ట్ చేసింది. ఇంతకీ రేణు పంచుకున్న మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యన పిల్లలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం హోటల్ కి తిరిగి వచ్చేటప్పుడు అకీరా అడిగిన ప్రశ్న తనని ఆశ్చర్యపరిచిందని తెలిపింది రేణుదేశాయ్. మహిళలు చీరకట్టుకోవడం ఎంతో సాధారణం. అయితే మగవారు ధోతీలు, లుంగీలు కట్టుకుంటే మాత్రం వేరేలా ఎందుకు చూస్తారు. పండగలు, గుళ్లకు వెళ్లినప్పుడే వాటిని ధరించాలా అని ప్రశ్నించాడట. ఆ మాటతో కాస్తంత ఆశ్చర్యానికి లోనయ్యానని ఆ తర్వాత తనకర్థమయ్యేలా చెప్పానంది. ఇప్పుడీ పోస్ట్ వైరల్ గా మారింది. తండ్రికి తగ్గ తనయుడని మరోసారి తన వ్యక్తిత్వంతో అకీరానందన్ రుజువుచేశాడని పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.