రివ్యూ : ఏజెంట్
తారాగణం : అఖిల్ అక్కినేని, సాక్షివైద్య, మమ్ముట్టి, సంపత్‌రాజ్, డినో మోరియా తదితరులు
సినిమాటోగ్రఫీ : రసూల్ ఎల్లోర్, జార్జ్ సి విలియమ్స్
సంగీతం : హిప్హాప్ తమిజా
నిర్మాత : రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపారెడ్డి
నిర్మాణ సంస్థలు : ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ -2 సినిమా
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
Akhil Agent Movie Review | యువహీరో అక్కినేని అఖిల్ ప్రతి సినిమాలో నటుడిగా పరిణితి సాధిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ప్రేమకథా చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సృష్టించుకున్నారు. అయితే కెరీర్లో భారీ కమర్షియల్ విజయం లేదనే అసంతృప్తి మాత్రం ఆయన్ని వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు అఖిల్. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. పూర్తి మేకోవర్‌తో సిద్ధమయ్యారు. అఖిల్ కెరీర్లోనే భారీ వ్యయంతో రూపొందించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అఖిల్ లుక్స్ కూడా కొత్తగా అనిపించాయి. ఈ నేపథ్యంలో నేడు విడుదలైన ‘ఏజెంట్’ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో తెలుసుకుందాం.
రిక్కీ అలియాస్ రామకృష్ణకు (అఖిల్) స్పై అవ్వాలన్నదే జీవితాశయం. భారత గూఢచార సంస్థ ‘రా’లో చేరి దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉంటాడు. అందుకోసం ‘రా’లో చేరేందుకు మూడుసార్లు పరీక్షలు రాసి విఫలమవుతాడు. అయితే ఎలాగైనా తాను ‘రా’ అధికారుల దృష్టిలో పడాలని ఎథికల్ హ్యాకింగ్‌కు పాల్పడతాడు. ‘రా’ అధిపతి డెవిల్ అలియాస్ మహదేవ్ (మమ్ముట్టి) కంప్యూటర్ను హ్యాక్ చేసి ఆయన మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తాడు. అయితే అవి కూడా ఫలించకపోవడంతో రిక్కీ నిరాశకు గురవుతాడు. మరోవైపు ‘రా’ మాజీ ఏజెంట్ ధర్మ అలియాస్ గాడ్ (డినో మోరియా) సిండికేట్‌ను ఏర్పాటు చేసుకొని శత్రుదేశాల సహాయంతో ఇండియాను నాశనం చేయాలని చూస్తుంటాడు. గాడ్ కుట్రలను ఛేదించడానికి రిక్కీని రంగంలోకి దింపుతాడు మహదేవ్. గాడ్ పన్నాగాలకు రామకృష్ణ ఎలా అడ్డుకట్ట వేశాడు ? అసలు ‘రా’ మాజీ ఏజెంట్ అయిన గాడ్ దేశంపై ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు? ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి జయకిషన్ (సంపత్‌రాజ్) పాత్ర ఏమిటి? ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసే క్రమంలో రామకృష్ణకు ఎదురైన సవాళ్లేమిటన్నదే మిగతా చిత్ర కథ..
క్లుప్తంగా చెప్పాలంటే ముగ్గురు ‘రా’ ఏజెంట్స్ మధ్య నడిచే యాక్షన్ థ్రిల్లర్ ఇది. శత్రు దేశాల కుట్రలను ఛేదించి దేశాన్ని రక్షించడమనే గూఢచారి సినిమా కథల్లోని కామన్ పాయింట్ ఇందులో కూడా కనిపిస్తుంది. అయితే ఈ తరహా స్పై కథల్లో యాక్షన్ ఎపిసోడ్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. వాటిని తెరపై ఎంత ప్రభావవంతంగా ఆవిష్కరిస్తే ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించవొచ్చు. అయితే ఆ మ్యాజిక్ ఈ సినిమాలో మిస్ అయిందనే భావన కలుగుతుంది. ైక్లెమాక్స్ సన్నివేశాలతో కథ చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. మంచి యాక్షన్ థ్రిల్లర్‌ను చూడబోతున్నామనే ఫీల్‌ను తీసుకొస్తుంది. ఏజెంట్ పాత్రలో అఖిల్ పరిచయ ఘట్టాలు, ఫైట్ ఆకట్టుకుంటుంది. ప్రథమార్థమంతా స్పై కావడం కోసం రిక్కీ చేసే ప్రయత్నాలు..ఈ క్రమంలో అతను వివిధ భాషలు నేర్చుకోవడం, సొంతంగా ఓ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేసుకోవడం ఆసక్తిని పంచుతుంది. కథానాయిక వైద్యతో రిక్కీ ప్రేమాయణం ఎపిసోడ్లో ఏమాత్రం కొత్తదనం కనిపించదు. అయితే తన ప్రేయసిని వేధించాడనే కోపంతో మంత్రి జయకిషన్ ఇంటికి రిక్కీ వెళ్లి హెచ్చరించే సన్నివేశంతో కథ ఒక్కసారిగా మలుపు తీసకుంటుంది. అభిమానులకు ఈ ఎపిసోడ్ బాగా నచ్చుతుంది. ఇంటర్వెల్‌కు ముందే అసలు కథ మొదలవుతుంది. భారతదేశానికి వ్యతిరేకంగా గాడ్ చేపట్టిన మిషన్‌ను అడ్డుకోవడానికి రిక్కీ రంగంలోకి దిగడం..ఈ క్రమంలో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుంది. అఖిల్ పవర్ఫుల్ లుక్స్, యాక్షన్ హంగామా మెప్పిస్తుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్ ఉత్కంఠను పంచడంతో ద్వితీయార్థంలో ఏం జరుగుతుందోననే ఆసక్తి మొదలవుతుంది. అయితే సెకండాఫ్‌లోని డ్రామా సాదాసీదాగా సాగుతుంది. సాధారణంగా స్పై కథల్లో వచ్చే అనూహ్యమైన మలుపులు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. అయితే ఈ కథలో ద్వితీయార్థంలో వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకుల ఊహకు అనుగుణంగానే ఉంటాయి. చాలా సీన్స్‌లో లాజిక్ మిస్సయిందనిపిస్తుంది. అయితే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను బాగా డిజైన్ చేశారు. వాటిలో అఖిల్ కనబరచిన పర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ైక్లెమాక్స్ ఘట్టాలు కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా సాగాయి. ‘రా’ ఆపరేషన్స్‌పై మరింత పరిశోధన చేస్తే కథ, కథనాల్ని సమర్థవంతంగా తెరపై తీసుకొచ్చే వీలుండేది.
ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన లుక్స్ మొత్తం మార్చుకున్నాడు. ఏజెంట్ పాత్రలో ైస్టెలిష్‌గా కనిపించాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. ముఖ్యంగా పోరాటఘట్టాల్లో అఖిల్ అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడు. తన పాత్రకు వందశాతం న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. ‘రా’ అధిపతిగా సీనియర్ నటుడు మమ్ముట్టి తనదైన అనుభవంతో పాత్రకు న్యాయం చేశారు. ఆయన పాత్ర చాలా హుందాగా అనిపిస్తుంది. ప్రతినాయకుడిగా డినో మోరియా ఆకట్టుకుంటాడు. కథానాయిక సాక్షివైద్య పాత్రకు అంత ప్రాధాన్యం దక్కలేదు. కేవలం పాటలకు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమైపోయింది. పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, సంపత్‌రాజ్ తమ పరిధుల మేరకు నటించారు. ఈ సినిమా కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి మంచి ఎఫర్ట్స్ పెట్టారు. తనదైన ైస్టెలిష్ మేకింగ్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ప్రయత్నం చేశారు. అయితే కథ, కథనాల్లో కొన్ని లోపాల్ని మాత్రం అధిగమించలేకపోయారు. ఇక సాంకేతికంగా ప్రతి విభాగంలో సినిమా ఉన్నతంగా అనిపిస్తుంది. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం హైలైట్‌గా అనిపిస్తుంది. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్:
అఖిల్ లుక్స్, మమ్ముట్టి నటన, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, ఉన్నతమైన నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ, కథనాలు..ద్వితీయార్థంలో పట్టుతప్పిన కథ..
రేటింగ్: 2/5