‘పదేళ్ల తర్వాత తెలుగు సినిమా చేశాను. ఇందులో శర్వానంద్ తల్లిగా నటించా. అమ్మ ఎల్లప్పుడూ మనతో ఉండలేదనే సత్యాన్ని ఆవిష్కరిస్తూ కథ సాగుతుంది’ అని అన్నారు అమల అక్కినేని. ఆమె ప్రధాన పాత్రలో శర్వానంద్, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీకార్తీక్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు.
ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అమల అక్కినేని మాట్లాడుతూ ‘ కాలం వెనక్కి వెళ్లగలిగినా విధిని మాత్రం తప్పించుకోరనే పాయింట్‌ను ఈ సినిమాలో చర్చించారు. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి’ అని చెప్పింది. ‘గడచిపోయిన జీవితాన్ని తలచుకుంటూ బాధతో, రేపటిపై ఆందోళనతో ఈ రోజును మనం విస్మరిస్తుంటాం. ఈ క్షణాన్ని ఆస్వాదించినప్పుడే జీవితం సంతోషంగా ఉంటుందనే విషయాన్ని ఈ సినిమాలో చెప్పాం. మదర్సెంటిమెంట్తో పాటు చక్కటి వినోదం కూడా ఉంటుంది.
సిరివెన్నెలగారు రచించిన పాట ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని శర్వానంద్ చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘టైమ్ ట్రావెల్ కథ ఇది. కాలంతో చేసే ప్రయాణం హృదయాల్ని కదిలిస్తుంది. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రచించిన అమ్మ పాట చిరకాలం నిలిచిపోతుంది. కాలం నేపథ్యంలో వచ్చిన కథల్లో పూర్తి వైవిధ్యంగా ఉంటుంది’ అన్నారు. తాము చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రమిదని, మనసును కదిలించే ఉద్వేగాలతో ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.